Cough Syrup: దగ్గు సిరప్ కలకలం-రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..!
మధ్యప్రదేశ్ లో దగ్గు మందు తాగి పసి పిల్లలు మృత్యువాత పడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కాఫ్ సిరప్ ల పంపిణీ, వాడకంపై నిఘా పెంచాయి. కేంద్రం కూడా వైద్యారోగ్యశాఖ అధికారుల్ని అప్రమత్త చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తాజాగా కీలక సూచనలు జారీ చేసింది. వీటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది.
జాతీయ ఔషధ నియంత్రణాధికారి డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ సంస్థలకు తాజాగా అడ్వైజరీ పంపారు. ఇందులో దగ్గు సిరప్‌లు, ఇతర మందుల తయారీలో ఉపయోగించే ముందు ముడి పదార్థాలను, సహాయక పదార్థాలను పరీక్షించాలని సూచించారు. ముందుగా ఇటువంటి తప్పనిసరి తనిఖీలను కఠినంగా పాటించి ఉంటే మన దేశంలోని రాజస్థాన్, జమ్మూ, విదేశాల్లో పిల్లల మరణాల్ని నియంత్రించే అవకాశం ఉండేదని నిపుణులు చెప్తున్నారు.

దగ్గు సిరప్ ఉత్పత్తికి ముందు ముడి పదార్థాలను పరీక్షించడంలో వైఫల్యం ఫలితంగా సిరప్‌లలో డైథిలిన్ గ్లైకాల్ , ఇథిలీన్ గ్లైకాల్ వంటి విషపూరిత పారిశ్రామిక ద్రావకాలు ఉన్నాయని గతంలో జరిగిన అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో సంభవించిన పిల్లల మరణాల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దగ్గు సిరప్ కు వాడే ముడి పదార్ధాలను మరింత నిశితంగా పరిశీలించాలని కేంద్రం సూచించింది.
దేశంలోని ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ తాజాగా జరిపిన తనిఖీలలో అనేక దగ్గు సిరప్్ తయారీదారులు ప్రతి బ్యాచ్ ఎక్సిపియెంట్లు, క్రియాశీల పదార్థాలను అమల్లో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించడం లేదని తేలినట్లు కేంద్రం తెలిపింది. ఇటువంటి లోపాలు, ఆమోదించబడిన ప్రయోగశాలలలో ప్రతి బ్యాచ్‌ను పరీక్షించడం , పూర్తి రికార్డులను నిర్వహించడం 1945 నాటి డ్రగ్స్ రూల్స్ ప్రకారం తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications