రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ-ఐదు రాష్ట్రాల్లో దారుణ ఓటమిపై చర్చ-జీ23 డిమాండ్లు ఇవే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవంపై చర్చించేందుకు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. అసలే దేశంలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా పార్టీలో అంతర్గత వర్గ పోరుతో మరో రాష్ట్రం పంజాబ్ లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు రేపు అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ నేతలు భేటీ కాబోతున్నారు.
వర్చువల్ విధానంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీతో పాటు దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీ, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. అలాగే సీడబ్ల్యూసీలో ఉన్న జీ23 నేతలు కూడా ఈ భేటీలో తమ అభిప్రాయాలు వెల్లడించబోతున్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎదురైన ఘోర పరాభవం నేతృత్వంలో పార్టీలో నాయకత్వ మార్పుకు మరోసారి నేతలు పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదు. ఏఐసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కూడా రెబెల్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో వ్యవస్ధాగత ఎన్నికల్ని సైతం తక్షణం నిర్వహించాలని వీరు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.

G23లో భాగంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి వారు ఇప్పటికే ఢిల్లీలోని గులాం నబీ ఆజాద్ నివాసంలో చర్చలు జరిపారు. రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత, G23 ఏర్పాటులో కీలకమైన సీనియర్ కాంగ్రెస్ నేత ఆజాద్ వీరితో జరిపిన చర్చల్లో కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టబోయే డిమాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జీ23 నేతల డిమాండ్లపై అధినేత్రి సోనియాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా ఐదురాష్ట్రాల్లో ఓటమితో తమపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సోనియా తీసుకోబోయే నిర్ణయాలే పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications