ట్రంప్ కు షాక్ - భారత్ కు పండగ- ఇన్వెస్టర్లకు 6 లక్షల కోట్లు..! పెరిగిన రూపాయి..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Results) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చిత్తుగా ఓటమిపాలవ్వడం, డెమోక్రాట్లు కాంగ్రెస్ లోని ఇరుసభలపై పట్టు సంపాదించడం భారత్ కు శుభసూచికగా మారింది. అమెరికా ఫలితాల తర్వాత ఇవాళ ముంబై దలాల్ స్ట్రీట్ లోని (Dalal Street) స్టాక్ మార్కెట్లో పలు షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 453 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో పెట్టుబడిదారులు ఈ సెషన్ లోనే ఏకంగా 6 లక్షల కోట్లు లాభపడ్డారు. అలాగే ముడి చమురు ధరలు కూడా పతనం అవుతున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత వాల్ స్ట్రీట్ లో నెలకున్న ర్యాలీ అంతర్జాతీయ సెంటిమెంట్ ను పెంచింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపించింది. డెమోక్రాట్ల విజయాలతో ట్రంప్ సుంకాల జోరుకు కళ్లెం పడుతుందన్న అంచనాలు, వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితికి తెరపడుతుందన్న అంచనాలు, ఇరాన్ వార్ ఉద్రిక్తలు తగ్గుతాయనే అంచనాలు స్టాక్ మార్కెట్ కు ఊపుతెచ్చాయి. దీంతో ఉదయం 10:04 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1,519 పాయింట్లు పెరిగి 78,820.40 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.. 436.70 పాయింట్లు పెరిగి 24,397.30 వద్ద ముగిసింది.

మరోవైపు ముడిచమురు ధరల పతనం మార్కెట్లో ర్యాలీకి కీలక కారణంగా నిలిచింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 1.09 శాతం తగ్గి బ్యారెల్‌కు 93.59 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 1.53 శాతం తగ్గి 86.77 డాలర్లకు పడిపోయింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా -ఇరాన్ వివాదం సద్దుమణగవచ్చనే అంచనాల మధ్య చమురు ధరలపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పరిస్దితుల్లో అమెరికా ఫలితాల తర్వాత క్రూడాయిల్ ధరలు తగ్గడం భారత్ కు ఊరట.
అమెరికా ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ లో హౌస్, సెనేట్ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాక భారత్ లో అనిశ్చితి మరింత తగ్గవచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలపడింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో 14 పైసలు పెరిగి ప్రస్తుతం 94.32 వద్ద కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications
