రేపు మీ ఆఫీసుకే వస్తున్నా- అరెస్టు చేసుకోండి- బీజేపీకి కేజ్రివాల్ సవాల్..!
ఢిల్లీలో ఆప్ ఎంపీ స్వాతీ మలివాల్ పై సీఎం కేజ్రివాల్ నివాసంలో జరిగిందని చెబుతున్న దాడి వ్యవహారం లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆప్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఈ దాడిని హైలెట్ చేస్తోంది. అదే సమయంలో స్వాతి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దాడికి కారకుడిగా భావిస్తున్న కేజ్రివాల్ పీఎస్ బిభవ్ కుమార్ ను ఇవాళ అరెస్టు చేసారు. దీనిపై కేజ్రివాల్ తీవ్రంగా స్పందించారు.
ఇప్పటికే ఆప్ కీలక నేతల్ని వరుసగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టులు చేస్తున్న పోలీసులు ఇప్పుడు తన పీఎస్ బిభవ్ కుమార్ ను సైతం అరెస్టు చేయడంపై ఇవాళ కేజ్రివాల్ స్పందించారు. రేపు మీ ఆఫీసుకే వస్తున్నా అక్కడే తనను అరెస్టు చేసుకోవాలని కేజ్రివాల్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. స్వాతి మలివాల్ ఘటనపై పరోక్షంగా స్పందిస్తూ ఆప్ నేతల్ని ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తున్నారని, రేపు తనను కూడా అరెస్టు చేసుకోవాలని సూచించారు.

తన పీఎస్ అరెస్టు నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసిన కేజ్రివాల్.. అందులో వీరంతా ఎలా ఆప్ వెంట పడుతున్నారో చూడాలని కోరారు. వారు తనను, మాజీ ఉప ముఖ్యమంత్రిని, మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీని జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు వారు తన వ్యక్తిగత కార్యదర్శిని అరెస్టు చేశారన్నారు. ఆప్ చేసిన నేరం గొప్ప ప్రభుత్వ పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను నిర్మించి, ఉచిత, నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడమేనని, అది బిజెపి చేయలేదని కేజ్రీవాల్ అన్నారు.












Click it and Unblock the Notifications