Opinion: జార్ఖండ్ లో కాషాయ రెపరెపలు ఖాయమేనా ? కలిసొస్తున్న అంశాలివే..!
జార్ఖండ్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. అధికార ఇండియా కూటమికీ, విపక్ష ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలు ఉన్నాయి. అయితే స్థానికంగా మారుతున్న రాజకీయ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక వేళ గెలిస్తే దానికి కారణమయ్యే అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
మోడీ జనాకర్షణ
గత లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమి గెలుపు తర్వాత ప్రధాని మోడీ జనాకర్షణ ఏ స్ధాయిలో ఉందో మరోసారి తేలింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అక్కడి స్దానిక పరిస్ధితుల్ని సైతం తారుమారు చేసే స్దాయిలో మోడీ జనాకర్షణ ఉందని పలు ఎన్నికలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో మోడీ జనాకర్షణ ప్రభావం జార్ఖండ్ ఎన్నికల్లోనూ బాగా ఉండబోతున్నట్లు స్థానికంగా అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

బాబూలాల్ మరాండీ రిటర్న్
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం(పీ) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న బాబూలాల్ మరాండీ బీజేపీని గట్టిగానే దెబ్బతీశారు. ఆయన పార్టీ గెలిచినవి మూడే సీట్లు అయినా రెండు సీట్లలో బీజేపీని దెబ్బతీసింది. ఇప్పుడు మరాండీ బీజేపీలోకి రీఎంట్రీ ఇచ్చేశారు. ఎస్టీ ప్రభావం ఉన్న సీట్లలో ఈ ప్రభావం కనిపించబోతోంది. అలాగే గతంలో వేరు కుంపటి పెట్టుకున్న ఏజేఎస్యూ పార్టీ నేత సుధేష్ మహతో కూడా ఎన్డీయేలోకి రీఎంట్రీ ఇవ్వడం కలిసి రానుంది.

చంపై సోరెన్ చేరిక
ఒకప్పుడు అధికార జేఎంఎంలో కీలక నేతగా ఉండి సీఎం హేమంత్ సోరెన్ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి పగ్గాలు కూడా అందుకున్న చంపై సోరెన్ కు గిరిజన వర్గాల్లో బాగా పట్టుంది. హేమంత్ జైలు నుంచి తిరిగి వచ్చాక తిరిగి సీఎం పదవి లాగేసుకోవడంతో జేఎంఎంను వీడి బీజేపీలో చేరిపోయిన చంపై సోరెన్ ఆ కసితో ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపబోతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కొల్హాయ్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెల్చుకోకుండా చూడటంలో చంపై సోరెన్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీతో ఉండటంతో అక్కడ కాషాయ పార్టీ అవకాశాలు మెరుగుపడ్డాయి.
ఇండియా కూటమి ప్రతివ్యూహాలు
బీహార్ సరిహద్దుల్లో ఉన్న బొగ్గు క్షేత్రాల్లో పట్టున్న సీపీఐ-ఎంఎల్, సీపీఐఎం ఇండియా కూటమిలోకి రావడం వారికి కలిసి వస్తోంది. జార్ఖండ్ జనాభాలో 26 శాతం ఎస్టీలు కాగా 4 శాతం క్రైస్తవులున్నారు. జేఎంఎంలో గిరిజన క్రైస్తవుల హవా కొనసాగుతోంది. ఇది మైనార్టీలు, ఎస్టీలు ఇద్దరికీ కంటగింపుగా మారింది. వీరిని సర్నా గిరిజనులుగా పేర్కొంటున్నారు.
ఇప్పుడు సర్నా, గిరిజన క్రైస్తవుల మధ్య ఉన్న ఈ విభజనను బిజెపి రాజకీయంగా వాడుకుంటోంది.బిజెపికి మద్దతిచ్చే ఎస్టీలలో అత్యధికులు సర్నా గిరిజనులు. 2024 సార్వత్రిక ఎన్నికలలో, ఇండియా కూటమి సర్నా కోడ్ అమలు, ప్రత్యేక మతంగా గుర్తించాలనే దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తామని హామీ ఇవ్వడం ద్వారా వారి మద్దతు పొందింది. దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుండటం వారికి ఇబ్బందిగా మారింది. ఇదొక్కటి మినహాయిస్తే బీజేపీ గెలుపుకు మిగతా సమీకరణాలు అనుకూలిస్తున్నాయి.












Click it and Unblock the Notifications