BYJUs రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసు-దేశం వదిలి వెళ్లొద్దని వార్నింగ్..!
నష్టాల్లో కూరుకుపోయిన ఎడ్ టెక్ స్టార్టప్ సంస్ధ బైజూస్ మరిన్ని చిక్కుల్లో పడింది. ఇప్పటికే నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో రూ.9,636 కోట్ల రూపాయలు చెల్లించాలని గతంలోనే నోటీసులు పంపిన ఈడీ.. ఇప్పుడు బైజూస్ బాస్ రవీంద్రన్ దేశం వదిలి వెళ్లిపోకుండా చర్యలు చేపట్టింది. రవీంద్రన్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయన్ను అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లొద్దని కోరింది.
బైజూస్ వ్యవస్ధాపకుడైన 43 ఏళ్ల రవీంద్రన్ ను దేశం విడిచి వెళ్లకుండా చూడాలని అన్ని విమానాశ్రయాలకు ఈడీ లుక్ అవుట్ సర్కులర్ పంపింది. గతేడాది బైజూస్ తన విలువలో 90 శాతం కోల్పోయినట్లు తేలాక అందులో పెట్టుబడిదారులు కూడా ఒక్కొక్కరుగా వలసపోయారు. అలాగే ఆడిటర్ అయిన డెలాయిట్ కూడా తప్పుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో తనకు 1.2 బిలియన్ డాలర్ల రుణమిచ్చిన రుణదాతలతో న్యాయపోరాటం కూడా ఎదుర్కొంటోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్ ను తప్పించి కొత్త బోర్డును నియమించేందుకు రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని వాటాదారుల బృందం కోరుతోంది. అయితే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు తమ తదుపరి విచారణ వరకూ చెల్లుబాటు కాకుండా కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ సమావేశం జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని వాటాదారులు చెప్తున్నారు. దీంతో రేపటి సమావేశంలో రవీంద్రన్ భవితవ్యంతో పాటు ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications