Punjab, Haryana Floods: పంజాబ్, హర్యానాలో తగ్గిన వానలు.. ఇంకా ముంపులోనే గ్రామాలు..
పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది. హర్యానాలోని యమునానగర్‌లోని హత్నికుండ్ బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు 53,370 క్యూసెక్కులు ఉండగా.. రాత్రి 8 గంటలకు 54,619 క్యూసెక్కుల ప్రవాహం పెరిగింది. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని ఘగ్గర్ నది వెంబడి అనేక గ్రామాలు వరద ముప్పు ఎందుర్కొన్నాయి. బుధ్లాడలోని చాంద్‌పురా ఆనకట్ట సమీపంలోని కట్ట తెగి గ్రామంలోకి నీరు చేరింది. శనివారం కూడా రెండు రాష్ట్రాల వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పంజాబ్‌లోని 14 జిల్లాలు, హర్యానాలోని 13 జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల 55 మంది మరణించారు. పంజాబ్‌లో వర్షాల కారణంగా మొత్తం 29 మంది మరణించగా, హర్యానాలో మరణాల సంఖ్య 26గా ఉంది. పంజాబ్‌లోని వివిధ వరద బాధిత జిల్లాల్లో 25,000 మందికి పైగా ప్రజలు, హర్యానాలో 5,300 మందికి పైగా ప్రజలు నీరాశ్రయులయ్యారు. వారిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా శనివారం ఫరీదాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాలను పరిశీలించారు.

చౌతాలా ట్రాక్టర్‌పై మంఝావలీని సందర్శించి, మోహనా-బాగ్‌పత్ వంతెన సమీపంలో, బాగ్‌పట్ ప్రాంతంలో బోటులో వరద పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు ఘగ్గర్ నది పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఖానౌరీ, మూనాక్ బ్లాక్‌లలో విధ్వంసం సృష్టించింది. ఈ నది చాలా ప్రాంతాలను ముంచెత్తింది. మూనాక్‌లోని కనీసం 20 గ్రామాల్లో వరద నీరు ఇప్పటికీ ఉందని, అయితే నీటి మట్టం తగ్గుముఖం పట్టిందని, ఆదివారం నాటికి మరింత తగ్గుతుందని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ జితేంద్ర జోర్వాల్ తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, ఆరోగ్య అధికారుల బృందాలు కూడా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మందులను పంపిణీ చేస్తున్నాయి. పంజాబ్‌లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 359 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు పనిచేస్తుండగా, వైద్య శిబిరాల సంఖ్యను 263కి పెంచారు. మొత్తం 25,160 మంది వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో మొత్తం 164 సహాయ శిబిరాల్లో 3,331 మంది మకాం వేసినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 1.60 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications