Goa elections: గోవాలో గెలిస్తే హామీలు నెరవేరుస్తామని అఫిడవిట్ లపై సంతకాలు చేసిన ఆప్ అభ్యర్థులు
గోవాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు ఎత్తులు పై ఎత్తులతో గోవా ఓటర్ల మనసులో స్థానం సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గోవాలోని అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మొత్తం 40 మంది అభ్యర్థులు పార్టీకి విధేయులుగా ఉంటామని, ఎన్నికైతే నిజాయితీగా పనిచేస్తామని అఫిడవిట్‌పై సంతకం చేశారు. ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని పార్టీ అభ్యర్థులు బాండ్ పేపర్ ల పై సంతకాలు చేశారు.
ఫిరాయింపులను నిరోధించేందుకు కేజ్రీవాల్ యత్నం
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ నిజాయితీపరులు, అయితే ఈ అభ్యర్థులు నిజాయితీపరులని ఓటర్లకు భరోసా ఇవ్వడానికి ఈ అఫిడవిట్ అవసరం" అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తరచుగా ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఫిరాయింపులు చేయడం గోవా రాజకీయాలలో అతి పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులతో అఫిడవిట్లపై సంతకాలు చేయించారు అరవింద్ కేజ్రీవాల్ .

లీగల్ అఫిడవిట్లపై సంతకాలు చేసిన ఆప్ అభ్యర్థులు
ప్రజలు మా అభ్యర్థులకు ఓటు వేయకముందే ఓటర్లలో ఉన్న ఫిరాయింపు భయాన్ని, తాము తొలగించాలి అనుకుంటున్నాం అని అందుకే ఈ లీగల్ అఫిడవిట్లు అని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో విలేకరులతో అన్నారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి అఫిడవిట్‌లను సమర్పించారు. అవి చట్టబద్ధంగా అమలు చేయబడతాయని, ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే ఉల్లంఘన కేసులు ప్రజలు నమోదు చేయొచ్చని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

గత ఎన్నికల్లో ఘోర ఓటమి, అయినా మళ్ళీ ఎన్నికల బరిలో ఆప్
గోవాలో నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందించాలని తమ పార్టీ కృతనిశ్చయంతో ఉందని, దీని కోసం ఫిరాయింపులను నిరోధించటం కీలకమైన చర్య అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం నాలుగు రోజుల గోవా పర్యటనలో ఉన్నారు, అక్కడ తన పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2017లో కూడా రాష్ట్రంలో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ మళ్లీ ఈ దఫా ఎన్నికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగుతోంది.

గోవా ఎన్నికల అజెండా ఢిల్లీ తరహా నమూనా
ఢిల్లీలోని అధికార పార్టీ ఆప్, గోవాలో ఉచిత విద్యుత్, మైనింగ్ కార్యకలాపాల పునరుద్ధరణ మరియు అందరికీ ఉపాధి వంటి వాటి 13 పాయింట్ల ఎజెండాపై దృష్టి సారించి గోవాలో కూడా ఢిల్లీ తరహా నమూనాను వాగ్దానం చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త బండారి సామాజికవర్గానికి చెందిన అమిత్ పాలేకర్ కు అవకాశం ఇచ్చింది. భండారీ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వడం ఓటు బ్యాంకు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు చూస్తున్నాయి.

ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్, ఆమ్ ఆద్మీ ప్రయత్నాలు ఫలిస్తాయా?
ప్రస్తుతం రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన సెయింట్ క్రూజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిత్ పాలేకర్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. గోవా ప్రజల మనసులను గెలుచుకోవడం కోసం, గోవా ఓటర్ల ఓటు బ్యాంకు కొల్లగొట్టడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications