Gujarat Elections : గుజరాత్ పోరు- మరో 12 మంది రెబెల్స్ ను సస్పెండ్ చేసిన బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి .. కాంగ్రెస్, ఆప్ రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. ఈసారి కూడా తమదే అధికారం అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ లోలోపల గుబులు మాత్రం తప్పడం లేదు. ఇలాంటి సమయంలో పార్టీ టికెట్లు నిరాకరించిన 38 మందిలో చాలా మంది రెబెల్స్ గా బరిలోకి దిగడాన్ని కాషాయ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
బీజేపీ టికెట్ రాకపోవడంతో దాదాపు 20 మంది రెబెల్స్ ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా బరిలోకి దిగారు. దీంతో వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీకి ఆశాభంగం తప్పలేదు. బరి నుంచి తప్పుకునేందుకు వారంతా నిరాకరించారు. దీంతో తొలి విడతలో ఏడుగురు రెబెల్స్ పై సస్పెన్షన్ వేటు విధించిన బీజేపీ... ఇవాళ మరో 12 మందిపై వేటు వేసింది. వీరంతా డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోటీ పడుతున్న వారే. వీరిని బుజ్జగించేందుకు చివరి వరకూ ప్రయత్నించిన కాషాయ నేతలు సఫలం కాలేకపోయారు. దీంతో సస్పెన్షన్ వేటు వేయక తప్పలేదు.

గుజరాత్ లో బీజేపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ 12 మందిపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఇవాళ ప్రకటించారు. తద్వారా రెబెల్స్ గా పోటీ చేయాలని భావిస్తున్న మరికొందరు వెనక్కి తగ్గుతారని బీజేపీ భావిస్తోంది. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దశలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 1న 89 సీట్లకు, డిసెంబర్ 5న మరో 93 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications