రాజ్యసభలో ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం-భగ్గుమన్న విపక్షాలు.. తీవ్ర విమర్శలు..
ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై పెత్తనం ప్రభుత్వానికే ఉండేలా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ తీసుకొచ్చిన సవరణ బిల్లును లోక్ సభలో నెగ్గించుకున్న కేంద్రం.. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రత్యేక పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్రం చెప్తుండగా.. విపక్షాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడుతున్నాయి.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చర్చ సందర్భంగా నరేంద్ర మోదీ సర్కార్ పై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ విరుచుకుపడ్డారు. దీనిని కంట్రోల్ ఫ్రీక్ సర్కార్ గా అభివర్ణించారు. ఈ చట్టంపై కేంద్రానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఆన హెచ్చరించారు. ఢిల్లీకి ప్రత్యేక రాజ్యాంగ హోదాను సృష్టించినప్పుడు, బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీ కూడా కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించలేదని, కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం కోర్టు తీర్పుల్ని పక్కనబెట్టి చట్టాలు తెస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. అలాగే ఢిల్లీలో అన్ని ఏజెన్సీలను హోం శాఖ పరిధిలో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు.

మరోవైపు ఢిల్లీ బిల్లుపై మాట్లాడిన బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది... 2013లో సీఎం అరవింద్ కేజ్రివాల్ అప్పటి సిఎం షీలా దీక్షిత్ నివాసంలో 10 ఎయిర్ కండీషనర్లు ఉన్నాయని, బాత్రూమ్‌లో కూడా ఏసీ ఉందని ట్వీట్ చేశారన్నారు. విద్యుత్ బిల్లు ఎవరు చెల్లించారని కూడా అడిగారన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ నివాసంలో 15 బాత్‌రూమ్‌లు, కర్టెన్‌లు ఒక్కొక్కటి కోటి విలువైనవి ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. ఈ రకమైన రాజకీయాలు అసంబద్ధమని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ ఎవరూ దేశ వ్యతిరేకులు ఉండరన్నారు. దేశం ఎలా అభివృద్ధి చెందాలి, దాని భవిష్యత్తు పరంగా దేశానికి ఏమి కావాలి అనే విషయంలో తమకు భిన్నమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రజాస్వామ్యంగా గాల్వాన్‌లో తమ 20 మంది సైనికులను చంపిన తర్వాత చైనాపై కఠినంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వాన్ని తాము విమర్శించామని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications