ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ విశ్వసనీయత ఎంత ? గత చరిత్ర ఇదీ..
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలపై పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ అంచనాలను నిన్న వెల్లడించాయి. ఇందులో జాతీయ స్ధాయిలో పలు ఎగ్జిట్ పోల్స్ ఎన్జీయే మరోసారి విజయం సాధించడం ఖాయమని తేల్చేశాయి. అయితే ఇవన్నీ నిజమా కాదా అనేది ఎల్లుండి ఎలాగో తేలిపోతుంది. అయితే ఇలా ఎన్డీయే విజయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చిన ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా సంస్థ గతంలో అందించిన సర్వేల ఫలితాలను చూస్తే దాని విశ్వసనీయత అర్ధమవుతుంది.
గతేడాది జరిగిన ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. అయితే ఫలితాల్లో మాత్రం బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అయితే ఇదీ తప్పని ఫలితాలు నిరూపించాయి. బీజేపీ అక్కడ గెలిచింది.

అలాగే 2021లోనూ పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కానీ అక్కడ టీఎంసీ ఏకంగా 200 సీట్లతో ఘన విజయం సాధించింది. నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ లో సైతం బీహార్ లో లోక్ జన్ శక్తి పార్టీ 4 నుంచి 6 సీట్లలో గెలుస్తుందని చెప్పింది. కానీ ఎల్జేపీ అక్కడ పోటీ చేసింది ఐదు సీట్లలోనే అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇలా పలు సందర్భాల్లో ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీయే కూటమి ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఇచ్చిన అంచనాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వంటి పార్టీలు ఈసారి యాక్సెస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications