బంగ్లాదేశ్ మాదిరి కేంద్ర ప్రభుత్వం కూల్చివేతకు ప్లాన్: రాజ్నాథ్ సింగ్
దేశ రాజధానిలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియా బ్లాక్, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనత పార్టీలపై ఆరోపణలు గుప్పించారు. దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్లాన్ చేశాయని ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాల మాదిరిగానే భారత్లోనూ అశాంతిని రేపి అధికార మార్పిడికి ప్రయత్నిస్తోన్నారని విమర్శించారు.
లక్నోలో కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం యువతను పావులుగా వాడుకుంటోన్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొందరు రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బహిరంగంగానే పిలుపునిస్తోన్నారని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు దేశ ప్రజాస్వామ్య పునాదులను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, శాంతిభద్రతలకు ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు.

ఇండియా బ్లాక్ గానీ, కాక్రోచ్ జనత పార్టీ గానీ చేపట్టిన ఆందోళనలు ఎన్నికల సంస్కరణల కోసమో లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగానో జరుగుతున్నవి కావని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తరహాలో తమ ప్రభుత్వాన్ని కూలదోయడమే వారికి ముఖ్య ఉద్దేశమని అన్నారు. విపక్షాలకు యువత భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక గానీ, పట్టింపు గానీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాక్రోచ్ జనత పార్టీ మద్దతుతో ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను దెబ్బతీసి, దేశంలో అశాంతి వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా అధికారాన్ని దక్కించుకోవడమే వారి ఏకైక ఎజెండా ఆరోపణలు చేశారు. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం బాధ్యతారాహిత్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఎన్నికల ద్వారా కాకుండా వీధి పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని, ఇటువంటి రాజకీయ కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత, స్థిరత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, వాటి పవిత్రతను కాపాడటమే తమ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు.
ఉత్తర ప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై దాదాపు 37 ఏళ్లు దాటిందని ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పార్టీ మద్దతు లేకుండా రాహుల్ గాంధీకి సొంతంగా రాయ్బరేలీ లోక్ సభ స్థానంలో గెలిచే సామర్థ్యం ఉందా అని సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో సొంత బలం లేకపోయినా, ప్రాంతీయ పార్టీల పొత్తుల వల్లే కాంగ్రెస్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోందని చురకలు అంటించారు.














Click it and Unblock the Notifications
