మా వల్ల కావట్లేదు.. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం: బెంగళూరు కపుల్స్ షాకింగ్!!
బెంగళూరుకు చెందిన దంపతులు తమ ఆగస్టు నెల ఖర్చుల వివరాలను తెలియజేస్తూ రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే.. దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాగే- వందల సంఖ్యలో రిప్లైలు ఇచ్చారు నెటిజన్లు. తమ అభిప్రాయాలను తెలియజేశారు.
తమ రోజువారీ జీవితాన్ని ఈ వీడియో ద్వారా ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.. ప్రకృతి, ఆశీష్ అనే దంపతులు. వారి ఆగస్టు నెల మొత్తం అయిన 5.90,000 రూపాయలు. బెంగళూరులో నెల రోజుల్లో తాము ఈ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు ఈ వీడియోలో వెల్లడించారు. ఇందులో అత్యధిక భాగం ప్రయాణాలకే కేటాయించారు. రెండుసార్లు విదేశాల్లో పర్యటించి వచ్చారు. మరో రెండుసార్లు దేశీయంగా ట్రావెల్ చేశారు. పలు పర్యాటక ప్రదేశాల్లో తిరిగారు.

ఈ ట్రావెలింగ్, విమాన టిక్కెట్లు, హోటళ్ల బుకింగ్ వంటివన్నీ కలిపి మొత్తం 3.50 లక్షల రూపాయల ఖర్చయిందని వివరించారు. వారి అద్దె రూ. 42,000, ఫిట్‌నెస్‌కు దాదాపు అంతే ఖర్చయింది. ఇద్దరికీ పర్సనల్ ట్రైనర్లు ఉన్నారు. ఈ నెలలో కొత్తగా పిలేట్స్ క్లాసులకు వెళ్ళగా.. దానికి అదనంగా మరో రూ. 40,000 ఖర్చయిందని తెలిపారు. కిరాణా సామాగ్రి, వంట ఖర్చు, భోజనాల కోసం రూ. 20,000 ఖర్చయిందట.
ఇంటి పనివాళ్లు, యుటిలిటీలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం రూ. 10,000లు వ్యయం అయినట్లు ఆశీష్ తెలిపాడు. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్, ఇ-కామర్స్ ద్వారా షాపింగ్ చేయడం, బయట తినడానికి రూ. 13,000 వెచ్చించారు. ఇది కాకుండా- తాము SIPల కోసం లక్ష రూపాయలను అదనంగా కేటాయించామని వివరించాడు. బయట తిరగడానికి క్యాబ్ ఛార్జీలు, లైఫ్ ఇన్సూరెన్స్, గ్రూమింగ్, బర్త్ డే వంటి సందర్భాల్లో బంధుమిత్రులకు గిఫ్టుల వంటి ఇతర ఖర్చులు సుమారు రూ. 15,000 అయ్యాయని ప్రకృతి తెలిపారు.
డబ్బు పట్ల తమ ఇద్దరి భిన్న వైఖరుల కారణంగా ఆర్థిక నిర్వహణ అదుపు తప్పిందని, దీన్ని నియంత్రించుకోవడం కష్టతరమౌతోందనిఆ కపుల్స్ పేర్కొన్నారు. కాలక్రమేణ..దుబారా ఖర్చులకు సంబంధించినంత వరకు ఓ అవగాహనకు వస్తున్నామని, ఇప్పుడు, ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి, ఎస్ఐపీ వంటి సేవింగ్స్ లల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఓ ప్లాన్ వేసుుకన్నామని తెలిపారు. ఇది అంత సులభం కాకపోవచ్చు గానీ..తప్పదని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు.
ఈ వైరల్ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోయారు. ఈ దంపతులు ఏమి పని చేస్తారనే ప్రశ్నలతో కామెంట్స్ సెక్షన్ నిండిపోయింది. "నాకు ట్రాకింగ్ షీట్ అంటూ ఏదీ వద్దు... మీరు ప్రతి నెలా అంతగా ఖర్చు చేసేంత డబ్బును ఎలా సంపాదిస్తున్నారనేది తెలుసుకోవాలని ఉంది.. అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఖర్చు చేయడానికి మార్గాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది.." అని మరో యూజర్ అడిగాడు.
"మీరు జీవనోపాధి కోసం ఏమి చేస్తారు?" అనే ప్రశ్నలే కామెంట్స్ సెక్షన్ లో ఎక్కువగా కనిపించాయి. "మీ ఒక నెల ఖర్చు = మా ఒక సంవత్సరం ఆదాయం" అని ఒక యూజర్ చమత్కరించారు. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనే విషయం తెలిసినప్పటికీ- మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనుకోలేదని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.












Click it and Unblock the Notifications