రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం లేదా ? రాష్ట్రాలకు సుప్రీం ప్రశ్న- రాజకీయ పార్టీల మౌనం
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ కలకలం రేపుతోంది. అన్నింటికంటే మించి రిజర్వేషన్ల మౌలిక స్వభావం, వాటిని కొనసాగించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తుతున్న అభిప్రాయాలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియక అంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి. తాజాగా నిన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. రిజర్వేషన్లకు బదులుగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో మేలు చేయగలమా లేదా అన్న అంశంపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది.

సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కేసు విచారణ
మహారాష్ట్రలో బలమైన వర్గమైన మరాఠాలకు రిజర్వేషన్ కల్పిస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ల వ్యవహారంపై మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రోజుకో ప్రశ్న సంధిస్తోంది.. దీంతో సుప్రీంకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు ఎలా స్పదించాలో తెలియక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయాలు లేవా, వాటిని ఎంతకాలం కొనసాగించాలన్న రెండు మౌలిక అంశాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు పార్టీలు, ప్రభుత్వాలు సమాధానం చెప్పలేని దయనీయ పరిస్ధితుల్లో ఉన్నాయి.

రిజర్వేషన్లతోనే మేలు జరుగుతుందా ?
ప్రస్తుతం దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను మరాఠా రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో చూస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. వాటిపై తాజాగా మరో ప్రశ్న సంధించింది. రిజర్వేషన్లకు బదులుగా వాటిని అందుకుంటున్న వర్గాలకు మేలు చేసే మరో ప్రత్యామ్నాయం లేదా అని రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. ఇతరత్రా మార్గాల్లో రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయంగా వారికి మేలు చేసే అవకాశం ఉందా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు ఎంత మంది సమాధానం ఇస్తారో తెలియని పరిస్ధితి.

రిజర్వేషన్లకు సుప్రీం ప్రత్యామ్నాయాలివే
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకే పరిమితం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయా వర్గాల్లో విద్యను ప్రోత్సహించడం, విద్యాసంస్ధలు నెలకొల్పడం వంటివి చేయొచ్చని సూచించింది. దీనిపై జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లకు బదులుగా విద్యాసంస్ధలు పెంచడం, ఇతర కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఆయా రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, జనాభా, ఇతర అంశాలతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లు ఎన్నో పోరాటాల తర్వాత వారికి లభించాయని కూడా తెలిపారు.

సుప్రీం ప్రశ్నలపై రాజకీయ పార్టీల మౌనం
రాష్ట్రాల్లో సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పిస్తున్న చెప్తున్న ప్రభుత్వాలు... ఇప్పుడు సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్ధితుల్లో కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై చర్చ మొదలుపెడితే రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న ప్రచారం మొదలవుతుందని, ఇది అంతిమంగా తమ పుట్టి ముంచుతుందని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అదే్ సమయంలో ఇప్పటికే రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న ఆరోపణను తెరపైకి తెచ్చారు. దీనిపై స్పందించేందుకు సైతం బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications