కర్నాటక ఎగ్జిట్ పోల్స్ : ఫలితాలపై యడియూరప్ప, కుమారస్వామి అంచనాలివే- కీలక వ్యాఖ్యలు...
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం రేపు ఉదయం అధికారికంగా పోలింగ్ శాతం ప్రకటించబోతోంది. మరోవైపు ఈ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ను సైతం పలు ఛానళ్లు, సర్వే సంస్ధలు వెల్లడించాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కట్టబెట్టాయి. మరికొన్ని సంస్ధలు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని కూడా తేల్చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జేడీఎస్ నేతలు స్పందించారు.
కర్నాటక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. ఈసారి బీజేపీ సంపూర్ణ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ ప్రభావం ఎన్నికలపై పడలేదని జాతీయ న్యూస్ ఛానల్ న్యూస్ 18తో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ మేరకు తనకు కన్నడ ప్రజల పల్స్ తెలుసంటూ యడ్డీ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఎన్నికల ముగిసి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న సమయంలోనే జేడీఎస్ నేత, మరో మాజీ సీఎం కుమారస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ధన రాజకీయాలకు తాము తట్టుకోలేకపోయామని, కేవలం డబ్బు లేని కారణంగానే 25 సీట్లలో గెలవలేకపోతున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. అలాగే ఈసారి జేడీఎస్ 25 సీట్లలోపే గెలుస్తుందని కూడా వెల్లడించారు. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ లోనూ జేడీఎస్ 25కు కాస్త అటు ఇటుగా మాత్రమే గెలుస్తుందని తేలింది.
అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మౌనంగా ఉంది. ఈ ఎన్నికల్లో తాము 140 సీట్లు గెలిచి అధికారం చేపట్టబోతున్నట్లు పోలింగ్ కు ముందే కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ప్రకటించారు. ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ ఆశించినట్లుగానే ఒంటరిగానే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కూడా పెరిగాయి.












Click it and Unblock the Notifications