ISRO: ఆ టైంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ: చంద్రయాన్-3 సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్ ఫుడ్!
శ్రీహరికోట: చంద్రడిపై పరిశోధనల కోసం చేసిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు ముంచెత్తాయి. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలు జరుపుతూ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం. తాజాగా, శనివారం సూర్యుడి సమీపంలో పరిశోధనలకు తొలిసారి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించింది.
అయితే, చంద్రయాన్-3, తాజా ఆదిత్య-ఎల్1 తోపాటు ఇంతకుముందు విజయం సాధించిన ప్రయోగాల్లో ఇస్రో శాస్త్రవేత్తలకు అందించిన ఆహారమే కీలక పాత్ర పోషించిందనే విషయం ఇప్పుడు వెలుగుచూసింది. ఇస్రో శాస్త్రవేత్తలను ఉత్సాహంగా ఉంచేందుకు, అదనంగా చేసే పనినైనా ఎంతో చక్కగా చేయడంలో ఈ ఆహారం దోహదపడిందట.

ఇస్రో శాస్త్రవేత్తలకు అందించే ఆ సీక్రెట్ ఫుడ్ విషయానికొస్తే.. అవే మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ. చంద్రయాన్ మిషన్ విజయం సాధించినందుకు శాస్త్రవేత్తలకు ఎలాంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవట. మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ చెప్పినట్లుగా ఓ ఇంగ్లీష్ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ఈ మేరకు ప్రచురించింది.
అసాధ్యమైన పనిని నిర్విరామంగా పని చేసేందుకు సైంటిస్టులకు ఓపిక, శక్తి కావాలని తెలిపారు. అందుకే ఈ రెండు(దోశ, ఫిల్టర్ కాఫీ) తీసుకుని అందరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారని వెంకటేశ్వర శర్మ తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు మేం భుజించే మసాలా దోశ, తాగే ఫిల్టర్ కాఫీతోనే ఈ విజయం సాధించాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా వీటి మీద అందరికీ ఆసక్తి పెరిగింది అని వెంకటేశ్వర శర్మ తెలిపారు.
వెంకటేశ్వర్మ శర్మ ఇస్రో ఉద్యోగినినే వివాహమాడారని ఆ కథనం వెల్లడించింది.
మరోవైపు, గతంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. తమ శాస్త్రవేత్తలు సాధారణ జీవితాన్నే గడుపుతారని తెలిపారు. వారెప్పుడు డబ్బును పట్టించుకోరు. ఏకాగ్రత మొత్తం మిషన్‌పైనే ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని నిపుణుల జీతాల్లో ఐదో వంతు మాత్రమే తీసుకునే ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications