50పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించి ఊహించని భారీ బహుమతులిచ్చిన అంబానీ ఫ్యామిలీ
ఆసియా ఖండంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఈ నెలలో 12వ తేదీన అంగరంగ వైభవంగా జరపడానికి నిర్ణయించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.
పేద జంటలకు సామూహిక వివాహాలు
అయితే అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లికి ముందు ముఖేష్ అంబానీ కుటుంబం తన కుమారుడి వివాహాన్ని పురస్కరించుకొని ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టింది. పేద జంటలకు వివాహం చేయాలని నిర్ణయించి, ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో 50 పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది.

వివాహ వేడుకలు ఘనంగా జరిపించిన అంబానీ ఫ్యామిలీ
ఇక ఈ సామూహిక వివాహాలకు ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో కొత్తగా పెళ్లి చేసుకున్న నూతన వధూవరుల తరఫున కొందరు బంధువులు కూడా హాజరయ్యారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముఖేష్ అంబానీ కుటుంబం ఈ సందర్భంగా పేర్కొంది.
పెళ్లి చేసుకున్న జంటలకు భారీ బహుమానాలిచ్చిన అంబానీ ఫ్యామిలీ
కేవలం వివాహాలు జరిపించడం మాత్రమే కాదు కొత్తజంటలకు బహుమానాలు కూడా అందించారు. వివాహానికి కావలసిన మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండిమట్టెలు, పట్టీలు పంపిణీ చేశారు. ఇక అలాగే పెళ్లి కుమార్తెలకు స్త్రీ ధనం కింద 1.01 లక్షల చెక్కులు అందించారు. అంతేకాకుండా వారికి ఒక ఏడాదికి సరిపడా సరుకులు, పాత్రలు, ఒక గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గృహోపకరణాలను బహుమతిగా అందించారు.
దేశ వ్యాప్తంగా ఇలా పేదల పెళ్ళిళ్ళు చేస్తామన్న అంబానీ దంపతులు
ఈ సామూహిక వివాహ వేడుకలకు వచ్చిన బంధుమిత్రులందరికీ భారీ విందు భోజనాలను ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు. ఈ పేద కుటుంబాలకు చెందిన జంటల వివాహ వేడుకలకు దాదాపు 800 మంది హాజరయ్యారు. రాబోయే పెళ్లిళ్ల సీజన్లో దేశ వ్యాప్తంగా ఇలాంటి పెళ్లిళ్లు జరిపించి తమ మద్దతును కొనసాగిస్తామని అంబానీ కుటుంబం పేర్కొంది. మానవసేవయే మాధవసేవ అని భావించి ఈ వివాహాలను చేపట్టినట్టు అంబానీ దంపతులు తెలిపారు. కొత్తగా వివాహం చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications