యూరప్ లో సహజీవనం, స్వలింగ వివాహాలే.. అయినా.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..!
నిష్కర్షగా మాట్లాడతారనే పేరున్న కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సహజీవనం, స్వలింగ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు భారతీయ సంస్కృతికి ఎందుకు విరుద్ధమూ వివరిస్తూనే యూరప్ లో ఈ రెండూ ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిపారు. అంతే కాదు సహజీవనం, స్వలింగ వివాహాలు ఎందుకు తప్పో కూడా గడ్కరీ తనదైన శైలిలో చెప్పారు.
తాను గతంలో బ్రిటీష్ పార్లమెంట్ కు వెళ్లిన సమయంలో తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడి ఎంపీలు తనతో మాట్లాడారని గడ్కరీ వెల్లడించారు. యూరప్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల కంటే సహజీవనాన్నే జంటలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ సహజీవనం, స్వలింగ వివాహాలు తమ సంస్కృతి కాదన్నారు. పెళ్లి చేసుకోకపోతే పిల్లలు ఎలా కంటారని ఆయన ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు ఏంటన్నారు. వీరంతా సామాజిక సంస్కృతికి విరుద్దంగా పోతే సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలన్నారు.

భారత్ లో ఇబ్బందికరంగా మారుతున్న పురుషులు, స్త్రీల నిష్పత్తిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే వీరిద్దరి మధ్య నిష్పత్తి తేడా ఎక్కువగా ఉంటే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆలోచించాలన్నారు. ఎందుకంటే మహిళలు 1500 మంది ఉండి పురుషులు 1000 మందే ఉంటే అప్పుడు పురుషులకు రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఇవ్వాల్సిన పరిస్ధితి ఉంటుందని గడ్కరీ తెలిపారు. అలాగే స్వలింగ వివాహాలు కూడా భారతీయ సంస్కృతిని చెడగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ అర్ధం చేసుకుని ముందుకెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications