నగ్న చిత్రమైనంత మాత్రాన అశ్లీలం కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మహిళలు నగ్నంగానో లేక అర్ధ నగ్నంగానో ఉన్నంత మాత్రాన ఆ దృశ్యాలను అశ్లీల దృశ్యాలుగా పేర్కొనరాదని, కామోద్రేకాన్ని ప్రేరేపించేందుకు ఉద్ధేశించినవి గానో లేక కామ వాంఛను వెల్లడించేవిగానో ఉంటే తప్ప వీటిని అశ్లీల దృశ్యాలుగా పరిగణించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
జర్మనీకి చెందిన టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ 1993లో తన ప్రియురాలితో కలసి నగ్నంగా దిగిన ఒక ఫొటోను ప్రచురించినందుకు ఒక వార్తా పత్రికపై దాఖలైన కేసును కొట్టిపారేస్తూ జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎకె సిక్రీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

కామవాంఛను, లేదా కామోద్రేకాన్ని ప్రేరేపించేవిగా ఉన్న లైంగిక సంబంధమైన దృశ్యాలను మాత్రమే అశ్లీల దృశ్యాలుగా పరిగణించేందుకు వీలుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎవరైనా మహిళ ఫోటో నగ్నంగానో లేదా అర్ధనగ్నంగానో ఉన్నంత మాత్రాన ఆ చిత్రాన్ని అశ్లీలమైనదిగా పేర్కోలేమన్నారు. సెక్స్ సంబంధమైన చిత్రాలు, ఇతరాలు కామపూరిత ఆలోచనలను ప్రేరేపిస్తాయని, వాటిని మాత్రమే అశ్లీలమైనవిగా పిలవాలని చెప్పింది.
సమకాలీన సామాజిక ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని, సగటు మనిషి కోణంలోంచి చూసి ఏది అశ్లీలం అన్నది నిర్ణయించాల్సి ఉంటుందని, అశ్లీలత అన్నది కాలగమనాన్ని బట్టి మారిపోతుందని, ఒక సందర్భంలో అశ్లీలం అనిపించింది మరో సందర్భంలో అనిపించకపోవచ్చునని తెలిపింది.












Click it and Unblock the Notifications