One Nation, One Election : జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం-రాజకీయ పార్టీలకు ఆహ్వానం
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల (One Nation, One Election) నిర్వహణ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం నియమించిన ఇవాళ తొలి భేటీ నిర్వహించింది. ఇందులో ఛైర్మన్ కోవింద్ తో పాటు మిగతా సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీలో తొలిసారి సమావేశమైన జమిలి ఎన్నికల కమిటీ భేటీలో ముందుగా ఛైర్మన్ కోవింద్ సభ్యులకు సమావేశ అజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల నిర్వహణపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో ప్రతినిధులు కలిగిన పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

వీరితో పాటు లా కమిషన్ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు జమిలి ఎన్నికలకు అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి, జమిలి ఎన్నికలపై అధ్యయనం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఈ కమిటీ రెండో భేటీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉండబోతోందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై నియమించిన కమిటీ త్వరలో తమ నివేదిక ఇస్తే దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ తో మిగతా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని సైతం వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications