కొత్త భవనంలోకి మారిన పార్లమెంట్-పాత కాంప్లెక్స్ కు ఎంపీల గ్రూప్ ఫొటో వీడ్కోలు...
పార్లమెంట్ ఇవాళ పాత భవనంలో నుంచి కొత్త భవనానికి మారింది. తాజాగా నిర్మించిన పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రారంభించగా.. ఇవాళ పాత భవనంలో నుంచి అధికారికంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా కొత్త కాంప్లెక్స్ కు మారాయి. అదే సమయంలో ఎంపీలు పాత భవనంలో జ్ఞాపకాల్ని భారంగా వదిలించుకుంటూ గ్రూప్ ఫోటో దిగి వీడ్కోలు పలికారు. కొత్త భవనంలో తొలి బిల్లుగా మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
లోక్‌సభ, రాజ్యసభ రెండూ మొదటిసారి కొత్త కాంప్లెక్స్‌లో తమ సమావేశాలను నిర్వహించడంతో మంగళవారం నుండి భారత పార్లమెంటు కార్యకలాపాలు కొత్తగా నిర్మించిన భవనానికి మారుతున్నాయి. మార్పుకు సూచికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత నుండి కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌కు రాజ్యాంగ ప్రతిని తీసుకువెళ్లారు. ఎంపీలు ప్రధానిని వెంట నడిచారు. అంతకు ముందు పాత కాంప్లెక్స్ బయట ఫొటో సెషన్ నిర్వహించారు. పాత భవనం వారసత్వంపై ప్రత్యేక కార్యక్రమం తరువాత నిర్వహిస్తారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ఎంపీలు ప్రతిజ్ఞ చేయనున్నారు.

ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లుల్ని తీసుకొస్తోంది. పార్లమెంట్ అమృతకాల సమావేశాలుగా కేంద్రం పిలుస్తున్న ఈ భేటీలో మహిళా బిల్లుతో పాటు పలు బిల్లులు తీసుకొస్తున్నారు. పార్లమెంట్ కూడా పాత భవనం నుంచి కొత్త భవనానికి మారిపోయింది. ఇందులో మహిళా బిల్లు తొలి బిల్లుగా సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. చాలా చోట్ల సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అలాగే పాత భవనంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications