కొత్త గవర్నర్‌గా బీజేపీ రాజ్యసభ ఎంపీ.. రాష్ట్రపతి ముర్ము కీలక నిర్ణయం!
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ దినేష్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నట్లు శనివారం రాత్రి రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ఈ నియామకం అమలులోకి వస్తుందని తెలిపింది.
తనపై నమ్మకంతో అంతటి కీలక బాధ్యతలు అప్పగించినందుకు దినేష్ శర్మ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాదని, దేశభక్తి, రాజ్యాంగం, ప్రజాసేవ పట్ల తనకు ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. పరిపూర్ణ నిబద్ధత, నిజాయితీతో తన బాధ్యతలను నెరవేరుస్తానని, అందరి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

మేయర్ నుంచి గవర్నర్ దాకా.. అనుభవజ్ఞుడైన నేత
62 ఏళ్ల దినేష్ శర్మకు రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా (2017-2022) సమర్థవంతంగా సేవలు అందించారు. అంతకంటే ముందు లక్నో నగర మేయర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2023లో యూపీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ల ప్యానెల్‌లో కూడా ఆయన సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీకాలం మరో కొన్ని నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా, ఈ లోపే కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ కీలక రాజ్యాంగ పదవికి ఎంపిక చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతంలో అత్యున్నత బాధ్యత
అండమాన్ నికోబార్ దీవులు కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల, అక్కడ లెఫ్టినెంట్ గవర్నరే రాజ్యాంగబద్ధమైన ప్రధాన పాలనాధికారిగా వ్యవహరిస్తారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న దినేష్ శర్మ నేతృత్వంలో ఈ దీవుల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications