పిలవకపోయినా విదేశీ టూర్లకు మోడీ-మేం అడగకూడదా ? పంజాబ్ సీఎం..!
ప్రధాని మోడీ ఈ మధ్య వరుసగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రధానీ వెళ్లని దేశాలకు సైతం వెళ్తూ అక్కడి దేశాధినేతల్ని కలుస్తూ, ఆయా దేశాల అవార్డుల్ని స్వీకరిస్తూ చర్చల్లో నిలుస్తున్నారు. ఘనా, ట్రినిడాడ్ టొబాకో వంటి చిన్న చిన్న దేశాలకు సైతం ప్రధాని మోడీ వెళ్లడం, అక్కడి అత్యున్నత అవార్డులు స్వీకరించడంపై దేశంలో చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆహ్వానాలు లేకపోయినా ప్రధాని మోడీ విదేశాలకు, చిన్న చిన్న దేశాలకూ చేస్తున్న పర్యటనలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించారు. ప్రధాని మోడీతో పాటు విదేశాంగ శాఖను సైతం టార్గెట్ చేస్తూ మాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధాని మోడీ ఆహ్వానాలు లేకుండా విదేశీ పర్యటనలు చేయడం, వాటిపై వస్తున్న విమర్శలకు విదేశాంగశాఖ కౌంటర్లు ఇవ్వడంపై భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు.

మన విదేశీ విధానం ఏంటని ప్రధాని మోడీని తాము ప్రశ్నించకూడదా అని విదేశాంగశాఖను భగవంత్ మాన్ అడిగారు. మనకు అసలు ఎవరు సాయం చేస్తున్నారు, అయినా ప్రధాని మోడీ ఇలా ప్రపంచం చుట్టేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి దౌత్య పరమైన కారణాలు లేకుండా, ఫలితాలు రాకపోయినా ప్రధాని మోడీ ఇలా ఆహ్వానాలు లేని పర్యటనలు ఎందుకని ఆయన అడిగారు. మనకు కనీసం పేర్లు కూడా తెలియని దేశాలకు ప్రధాని మోడీ పర్యటనలు చేస్తున్నారని, అవార్డులు అందుకుంటున్నారని, అక్కడ కూడా మన దేశంలో జేసీబీలు కూల్చివేతలకు వెళ్తుంటే గుమికూడినంత జనం కూడా రావడం లేదని ఆక్షేపించారు.

భగవంత్ మాన్ ఇప్పటికే ఓసారి ప్రధాని పర్యటనలపై చేసిన విమర్శలపై స్పందించిన విదేశాంగశాఖ.. ఈ విమర్శలు తీవ్ర ఆక్షేపణీయమని, అర్ధరహితమని వ్యాఖ్యానించింది. గ్లోబల్ సౌత్ నుండి స్నేహపూర్వక దేశాలతో భారతదేశం యొక్క సంబంధాల గురించి ఒక రాష్ట్ర అధిపతి చేసిన కొన్ని వ్యాఖ్యలను చూశామని, ఈ వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవి, విచారకరమైనవని, రాష్ట్ర అధిపతికి తగనివి అంటూ విమర్శించింది. అయినా మరోసారి భగవంత్ మాన్ తాజా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications