మహా విపక్షంలో రాహుల్ వ్యాఖ్యల చిచ్చు- కాంగ్రెస్ తో బ్రేకప్ కు ఉద్ధవ్ హెచ్చరికలు...
వీడీ సావక్కర్ దేశద్రోహి అని, గాంధీ, నెహ్రూ, పటేల్ లను మోసం చేసి బ్రిటీషర్లను శరణు వేడుకున్నాడంటూ రాహుల్ గాంధీ బయటపెట్టిన లేఖ ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోయినా కూటమిగా కలిసున్న కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ కూటమిలో ఈ వ్యాఖ్యలు చిచ్చు రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై శివసేనలోని రెండు గ్రూపులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మహారాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన-బీజేపీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటోంది. రాహుల్ భారత్ జోడో యాత్రను అడ్డుకుంటామని ఇప్పటికే పలు హెచ్చరికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన (ఉద్ధవ్) వర్గం కూడా రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతోంది. రాహుల్ వ్యాఖ్యలు ఎంవీఏ కూటమి పతనానికి దారి తీస్తాయని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు.

సావర్కర్ భావజాలాన్ని నమ్ముతామని, రాహుల్ వ్యాఖ్యల్ని అందుకే సీరియస్ గా తీసుకుంటున్నట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు. రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరుకునపడింది. అయితే ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బయటికొచ్చినా దక్కే ప్రయోజనం లేకపోవడంతో శివసేన ఉద్ధవ్ వర్గం ఆచితూచి స్పందిస్తోంది. అయినా ఒత్తిడి మరింత ఎక్కువైతే కాంగ్రెస్ తో స్నేహాన్ని గుడ్ బై చెప్పే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై కూడా రాహుల్ పై చర్యలకు ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications