Rajasthan Polls: రాజస్తాన్ లో పెరిగిన పోలింగ్ శాతంతో కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి మేలు?
రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ తో పోలిస్తే ఈసారి ఒక శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో స్వల్పంగా పెరిగిన ఈ పోలింగ్ శాతం ఎవరికి మేలు చేయబోతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగిన తరుణంలో ఓటింగ్ సరళి ఎలా సాగిందన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఐదేళ్లకోసారి అధికార పార్టీల్ని మార్చేయడం అక్కడి ఓటర్లకు రివాజుగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి అధికార కాంగ్రెస్ ను కాదని బీజేపీకి ఓటర్లు పట్టం కడతారన్న అంచనాలతో ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆ పార్టీకి మొగ్గు ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ ఈసారి వ్యూహాలు మార్చడంతో ఆ పార్టీకి మరోసారి అధికారం దక్కవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పోలింగ్ లో గతం కంటే ఒక్కశాతం ఓటర్లు అధికంగా ఓటేశారు.

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చురుగ్గా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేయడం, ఒకశాతం పోలింగ్ పెరగడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇది తమకే మేలు చేస్తుందని చెప్పుకుంటున్నాయి. అలాగే రాష్ట్రంలో ఐదేళ్ల కోసారి ప్రభుత్వాల్ని మార్చేసే ట్రెండ్ కూడా బీజేపీ వంటి పార్టీలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే గత ఎన్నికల డేటా ప్రకారం ఓట్ల శాతం 3-4% పెరిగితే బీజేపీకి లాభం చేకూరుతుందని అంచనా. ఓట్ల శాతం 1% తగ్గితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే బీజేపీ ఆనందం వెనుక మరో కారణం కూడా ఉంది. ఓటింగ్ పెరుగుదల కనిపించినప్పుడల్లా గతంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో ఈసారి 1 శాతం పోలింగ్ పెరుగుదల కూడా తమకే అనుకూలమని ఆ పార్టీ చెప్పుకుంటోంది. కానీ వాస్తవ గణాంకాల ఆధారంగా చూస్తే కనీసం 3-4 శాతం పోలింగ్ పెరిగితే తప్ప రాష్ట్రంలో అధికార మార్పిడి కష్టమేనన్న వాదన ఉంది. అలాగని ఓటింగ్ శాతం తగ్గకపోవడం చూస్తే కాంగ్రెస్ లోనూ టెన్షన్ కొనసాగుతోంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపుతో ఈ టెన్షన్ కు తెరపడనుంది.












Click it and Unblock the Notifications