పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల శాతం ఎలా పెరుగుతోంది ? ఈసీని అడిగిన సుప్రీంకోర్టు..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్నాయి. ఇందులో ప్రతీ దశ పోలింగ్ తర్వాత సాయంత్రానికి పోలింగ్ శాతాలు వెల్లడించే అవకాశం ఉన్నా ఈసీ మాత్రం అలా చేయడం లేదు. కొన్ని రోజుల తర్వాత పోలింగ్ శాతాలు ప్రకటిస్తోంది. అందులోనూ భారీగా పోలింగ్ పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈసీ తీరును ఆక్షేపించింది.
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఓటింగ్ శాతాలను ఈసీ ప్రకటించకపోవడంపై రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై ఈసీని అడిగినా స్పందించడం లేదని ఆక్షేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పోలింగ్ పూర్తయిన తర్వాత తుది పోలింగ్ గణాంకాలు ఎప్పటిలోగా అందుతున్నాయని ఈసీని ప్రశ్నించింది. అదే రోజు సాయంత్రం తమకు గణాంకాలు అందుతున్నట్లు ఈసీ తెలిపింది. అటువంటప్పుడు కొన్ని రోజుల తర్వాత వరకూ తుది పోలింగ్ శాతాలు ఎందుకు ప్రకటించడం లేదని సుప్రీంకోర్టు నిలదీసింది. దీనికి ఈసీ వద్ద సమాధానం లేదు. అదే సమయంలో తుది పోలింగ్ శాతాలు ఎందుకు పెరుగుతున్నాయని కూడా ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈవీఎంల మార్పిడి వల్లే తుది పోలింగ్ శాతాలు పెరుగుతున్నాయని, కాబట్టి వీటి స్ధానంలో బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలని పిటిషనర్ ఏడీఆర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ దీనిపై కూడా వివరణ ఇవ్వాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈవీఎంల వాడకం వల్ల ఎన్నికల్లో తమకు అన్యాయం జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏ పార్టీ విపక్షంలో ఉంటే ఆ పార్టీ ఇదే వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ కీలకంగా మారింది. ఈసీ వివరణ తర్వాత సుప్రీంకోర్టు దీనిపై తమ నిర్ణయం ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications