బీజేపీ ప్లాన్ బూమరాంగ్-ఉపఎన్నికల షాక్ తో చమురు ధరలు తగ్గింపు-వ్యాట్ తగ్గించని ఆ రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా దీపావళి కానుకగా చమురు ధరల్ని తగ్గించేందుకు వీలుగా ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం.. అదే సమయంలో మీరు వ్యాట్ కూడా తగ్గించాలని రాష్ట్రాల్ని కోరింది. అయితే దీనిపై స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు తమకు తోచినంత, వీలైనంత మేర వ్యాట్ తగ్గించాయి. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి షాకిచ్చాయి. దీంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల్ని బీజేపీ టార్గెట్ చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అయితే ఆయా రాష్ట్రాలు ఎందుకు వ్యాట్ తగ్గించలేదనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

కేంద్రం పెట్రో ఊరట
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ.. వినియోగదారులు అల్లాడుతున్నారు. అయితే దీపావళి కానుక పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో కొంత మేర ధరలు దిగొచ్చాయి. గరిష్టంగా లీటరు పెట్రోల్ పై 5 రూపాయలు, లీటరు డీజిల్ పై 10 రూపాయల వరకూ ధర తగ్గింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం దీపావళి వేళ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చింది. ఇన్నాళ్లూ పావలా తగ్గిస్తే రూపాయి పెంచేస్తున్న చమురు సంస్ధల దాష్టికాలు మాత్రమే చూస్తున్న వినియోగదారులకు ఈ తగ్గింపు ఊరటనిచ్చింది.

రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలన్న కేంద్రం..
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం..అదే సమయంలో రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గించాలని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు స్పందించాయి. బీజేపీ పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు తమకు వీలైనంతగా వ్యాట్ తగ్గిస్తూ పోటాపోటీగా నిర్ణయాలు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని వినియోగదారులకు దీపావళి వేళ డబుల్ ధమాకా లభించినట్లయింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గకపోవడంతో వినియోగదారుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది.

కేంద్రానికి షాకిచ్చిన బీజేపీయేతర రాష్ట్రాలు
మేం ఎక్సైజ్ సుంకం తగ్గించాం కాబట్టి మీరు వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరినా బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఆ సూచనను అస్సలు పట్టించుకోలేదు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ పాలిత కర్నాటక మినహా మరే రాష్ట్రం కూడా కేంద్రం సూచనను పట్టించుకోలేదు. దీంతో దీపావళి కానుక పేరుతో ఎక్సైజ్ సుంకం తగ్గించి రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించ లేదు. చివరికి బీజేపీయేతర పార్టీల్లో కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు సైతం కేంద్రం సూచన పట్టించుకోకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

బీజేపీ ప్లాన్ బూమరాంగ్
ఇన్నాళ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అన్ని రాష్టాలూ చమురు ధరలు తగ్గించాలని పలుమార్లు డిమాండ్లు చేస్తున్నా పట్టించుకోని బీజేపీ.. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేసరికి వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పెట్రో ధరల్ని అమాంతం తగ్గించేసింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే ఆ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసేసుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో మీరు వ్యాట్ తగ్గించడంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. దీంతో అసలు వాస్తవాన్ని గ్రహించిన బీజేపీయేతర రాష్ట్రాలేవీ వ్యాట్ తగ్గింపుకు మొగ్గు చూపడం లేదు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో ఉంటే కనీసం తమ వాటా అయినా వచ్చేది. కానీ ఇప్పుడు చమురు ఉత్పత్తులపై అమల్లో ఉన్న వ్యాట్ కారణంగా దాన్ని తగ్గించినా తమకే నష్టమని భావిస్తున్న ఆయా రాష్ట్రాలు మౌనంగా ఉండిపోతున్నాయి.












Click it and Unblock the Notifications