షాకింగ్: ఫోన్ కోసం గొడవ.. భర్త కంట్లో కత్తెరతో పొడిచిన భార్య!!
మహిళల్లో రోజు రోజుకి పాశవిక ప్రవృత్తి పెరుగుతుంది. ఊహించని విధంగా మహిళలు దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం నివ్వెరబోయేలా భర్తల పై దాడులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేవలం ఫోన్ అడిగిన భర్తపై ఆగ్రహంతో భార్య చేసిన ఘాతకం వింటే నివ్వెర పోవాల్సిందే.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పాత్ లో మూడేళ్ల క్రితం అంకిత్, ప్రియాంక లకు వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుండి భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూనే ఉన్నారు. తాజాగా భార్యాభర్తల మధ్య ఫోన్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. యూట్యూబ్లో పాటలు చూడడం కోసం భార్య మొబైల్ ఫోన్ ఇవ్వాలని భర్త అంకిత్ కోరారు.

దీంతో తన ఫోను ఇవ్వనని భర్తతో భార్య ప్రియాంక వాదించింది. ఫోన్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానగా మారి భార్య భర్త పై కత్తెరతో దాడి చేసింది. భర్త ఫోన్ అడగడంతో కోపోద్రిక్తురాలైన ప్రియాంక కత్తెరతో అంకిత్ కంటిలో పొడిచింది. దీంతో అతని కన్ను తీవ్రగాయం కాగా అతను బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో కుటుంబ సభ్యులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో అతను చికిత్స తీసుకుంటున్నాడు.భర్త కంటిలో పొడిచిన తర్వాత భార్య ప్రియాంక అక్కడి నుంచి పరార్ అయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై దాడి చేసి పారిపోయిన భార్యను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతూ మహిళలు ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు ప్రస్తుత సమాజంలో మహిళల మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.
ఒకప్పుడు పురుషులే మహిళలపై దాడులకు పాల్పడే వారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా దారుణ ఘటనలకు వెనుకాడటం లేదు. అయితే క్షణికావేశమే దాడులకు కారణం అని అంటున్నారు మానసిక నిపుణులు. భార్యా భర్తల మధ్య సఖ్యత లేకుంటే కౌన్సిలింగ్ తీసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప ఇలా దాడులు చెయ్యటం మంచిది కాదంటున్నారు.












Click it and Unblock the Notifications