అందంగా ఉండి, ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు: సచిన్ పైలట్‌కు అశోక్ గెహ్లాట్ చురకలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ఓ వైపు రెబల్ నేత సచిన్ పైలట్‌కు పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ కాంగ్రెస్ పెద్దలు చెబుతుండగా.. మరోవైపు రాజస్థాన్ రాష్ట్ర నేతలు మాత్రం ఆయనపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ సహా ఆయన మద్దతుదారులంతా సచిన్ పైలట్ మాటెత్తితేనే మండిపడుతున్నారు.
Recommended Video

అందంగా ఉండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడితే సరిపోదు..
రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సచిన్ పైలట్ బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం అశోక్ గెహ్లాట్. అంతేగాక, ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, మీడియాకు బాగా అభిప్రాయాలను వెల్లడించడం, అందంగా ఉండటం ఒక్కటే సరిపోదని సచిన్ పైలట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బీజేపీతో కలిసి కుట్రలు..
దేశం కోసం మీ హృదయంలో ఏముంది? సిద్ధాంతం, నినాదాలు, అంకితభావం అనేవి కీలకమని హితవు పలికారు. జైపూర్‌లో తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు కొనసాగిస్తోందని, ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని గెహ్లాట్ చెప్పుకొచ్చారు. పదిరోజులపాటు తమ ఎమ్మెల్యేలను హోటళ్లలో ఉంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, లేదంటే మధ్యప్రదేశ్ లో జరిగిందే ఇక్కడా జరిగే అవకాశం ఉందన్నారు.

40ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: అశోక్ గెహ్లాట్
తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నూతన తరాన్ని తాము స్వాగతిస్తామని, భవిష్యత్ వారిదేనని గెహ్లాట్ చెప్పుకొచ్చారు. నేటి తరం నేతలు కేంద్రమంత్రులు, రాష్ట్ర పార్టీ చీఫ్‌లుగా ఎదిగారని చెప్పారు. తాము కూడా ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చామనే విషయం గుర్తుంచుకోవాలని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

సచిన్ సహా మద్దతుదారులకు స్పీకర్ నోటీసులు
కాగా, తిరుగుబాటు నేపథ్యంలో ఇప్పటికే సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అంతేగాక, అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసింది. సచిన్ పైలట్ తోపాటు అతని సన్నిహితులైన ఇద్దరు మంత్రులు, ఇతర మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. సచిన్ పైలట్ తోపాటు మరో 30 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. అయితే, సచిన్ పైలట్ బీజేపీలో చేరడం లేదని ప్రకటించడంతో.. ఆయన కొత్త పార్టీ పెడతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications