ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్-హైపవర్ కమిటీ ఎంపిక..!
భారత ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల ఖాళీలకు ఇద్దరు టాప్ బ్యూరోక్రాట్లను ఎంపిక చేస్తూ ప్రధాని, కేంద్రమంత్రి, విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన హైపవర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాతో సీఈసీ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీలో మిగిలారు. దీంతో ఇవాళ సమావేశమైన హైపవర్ కమిటీ ఈ మేరకు వీరిద్దరిని ఎంపిక చేసింది.
భారత ఎన్నికల సంఘం టాప్ ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇవాళ మీడియాకు వెల్లడించారు. త్వరలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సిన తరుణంలో ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీ, అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరితో కూడిన హైపవర్ కమిటీ ఈ నియామకాలు చేసింది. ఇందుకోసం 236 పేర్లతో కూడిన ఐదు జాబితాలను ప్రభుత్వం కమిటీకి పంపింది.

భారత ప్రభుత్వంలో సెక్రటరీగా లేదా సెక్రటరీకి సమానమైన, సెక్రటరీగా పదవీ విరమణ చేసిన 92 మంది అధికారుల పేర్లు, అలాగే సెక్రటరీగా లేదా సెక్రటరీకి సమాన అధికారులుగా పనిచేస్తున్న 93 మంది అధికారులు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులుగా పదవీ విరమణ చేసిన 15 మంది అధికారుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications