"అరెస్టు తర్వాత 24 గంటల్లో కోర్టుకు "- పోలీసులు, హైకోర్టులకు సుప్రీంకోర్టు క్లారిటీ..!
దేశవ్యాప్తంగా పోలీసులకు చట్టప్రకారం ఎవరినైనా నిర్బంధించిన తర్వాత 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలనే నిబంధన ఉంది. అయితే పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో, తమ పంతాలతో నిర్బంధించిన వ్యక్తిని అరెస్టు చూపించిన 24 గంటల తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ ఆందోళన వ్యక్తం చేసింది. అరెస్టు తర్వాత నిందితుల్ని కోర్టులో హాజరుపర్చేందుకు ఉన్న 24 గంటల గడువు నిబంధనపై ఇవాళ స్పష్టత ఇచ్చింది.
అరెస్టు తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాలన్న నిబంధనను పోలీసులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొత్త అర్ధాలు వెత్తుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ వ్యక్తిని అయినా నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాల్సిందేనని పోలీసులకు స్పష్టం చేసింది. అధికారికంగా అరెస్టు చూపించిన 24 గంటల తర్వాత కోర్టులో హాజరుపరుస్తామంటే కుదరదని అత్యున్నత న్యాయస్దానం తేల్చిచెప్పేసింది.

రాజ్యాంగం ప్రకారం నిర్బంధం, అరెస్టు రెండూ దాదాపు ఒకటే అని, ఈ రెండు సందర్భాల్లోనూ సదరు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అరెస్టుకూ, నిర్బంధానికీ మధ్య పోలీసులు చూపిస్తున్న వ్యత్యాసం రాజ్యాంగ పరంగా చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో పలు హైకోర్టులు కూడా తేడా చూపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కాబట్టి ఏ వ్యక్తిని అయినా అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు సమీపంలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సిందేనని తేల్చిచెప్పింది. విచారణలు ఆలస్యం కావడం, బెయిల్ ఇవ్వడం వంటి సందర్భాల్లో నిందితుల స్వేచ్ఛ కన్నా చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ముఖ్యంగా యూఏపీఏ, నార్కోటిక్ కేసులు, మనీలాండరింగ్ కేసుల్లో వ్యక్తి స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ప్రత్యేక చట్టాల ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేయకూడదని, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఆధారంగా ఆయా చట్టాలు అమలు కావాలని తెలిపింది.














Click it and Unblock the Notifications
