భారీవర్షాలతో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్- ఏలూరు, తూర్పుగోదావరిలో ఎన్నికల వాయిదా..!
ఆంధ్రప్రదేశ్ పై మురసు తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గలేదు. తుఫాన్ బలహీనపడి అల్పపీడనం దశకు చేరుకున్నా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించారు. ఇంకొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏలూరు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని వాయిదా వేశారు.
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇవాళ ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాకు సైతం వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో ఇవాళ జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని రేపటికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొయ్యలగూడెం మండలం అచ్చుతాపురంలోని 31,32 కేంద్రాల్లోనూ ఎన్నికలు వాయిదా వేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేశారు. తుపాను ప్రభావంతో వర్షాలు, కలెక్టర్ల నివేదికల ఆధారంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications
