దీపావళి బాణాసంచాపై నిషేధం-హైకోర్టు ఉత్తర్వుల్ని పక్కనబెట్టిన సుప్రీంకోర్టు...
దీపావళి సందర్భంగా కాలుష్యం వ్యాప్తి పర్యావరణానికి హాని చేస్తోందంటూ ఈ మధ్య కాలంలో మొదలైన ప్రచారం పండుగ రోజు వేడుకలకు ఆటంకంగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజు ఇంట్లో పిల్లలతో కలిసి బాణాసంచా కాల్చుకుందామని భావించే వారికి తాజాగా కోర్టులు ఇస్తున్న ఉత్తర్వులు షాక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
తాజాగా దీపావళి సందర్భంగా పశ్చిమబెంగాల్లో పూర్తిగా బాణాసంచాపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. దీపావళి రోజు పూర్తిగా బాణాసంచా వాడకాన్ని నిషేధించడం న్యాయ సమ్మతమా కాదా అన్న పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కలకత్తా హైకోర్టు ఉత్తర్వుల్ని తోసిపుచ్చింది. పర్యావరణ హితం కోసం బాణాసంచా పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ టపాసులు అమ్మేందుకు, కాల్చేందుకు అనుమతిస్తూ జస్టిస్ ఖాన్విల్కర్, అజయ్ రస్తోగితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

అక్టోబర్ 29న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. అలాగే పర్యావరణ హితంగా దీపావళి నిర్వహించే విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంది. అటువంటప్పుడు దీపావళిపై పూర్తి నిషేధం విధించాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదైనా జరిగితే అప్పుడు వివరాలు సమర్పించాలని పిటిషనర్లతో పాటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications