Tamil Nadu: తమిళ ఎన్నికల్లో విదేశీయుల ఓట్లు ? రంగంలోకి ఈసీ, ఐబీ-ఎస్ఐఆర్ పైనా..!
తమిళనాడు (Tamil Nadu)లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్న ఈసీ, నిఘా సంస్థలతో కలిసి దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశీయులు (Foreign Nationals) భారీ సంఖ్యలో తమిళనాడుకు వచ్చి ఓటేసి తిరిగి వెళ్లిపోయారు. తమిళనాడులో ఈసారి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) జరిగిన తర్వాత కూడా చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తమిళనాడులో ఓటేసిన ఎన్నారైలు(Tamil Nadu)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విదేశీయులు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. భారత సంతతికి చెందిన సుమారు 40 మంది విదేశీ పౌరులు అక్రమంగా ఓటు వేసినట్లు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో, అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే విదేశాలకు తిరిగి వెళ్లిన వారిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి.

ఈసీ, దర్యాప్తు సంస్దల కన్ను
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు భారత ఎన్నికల కమిషన్ (ECI)తో కలిసి వివరాలు సేకరిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు వచ్చి, రెండు మూడు రోజుల్లోనే దేశం విడిచి వెళ్ళిన వారిని గుర్తించడంలో సహాయం చేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను అధికారులు కోరారు. వీటితో పాటు, సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యక్తులు చేసిన పోస్ట్‌లు, వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వచ్చినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్న వారిపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
మధురై ఎయిర్ పోర్టులో బయటపడ్డ వైనం
ఈ అక్రమాల వ్యవహారం మే రెండో వారంలో మదురై ఎయిర్ పోర్టులో తొలిసారి బయటపడింది. కొలంబోకు వెళ్తున్న ఒక జంటను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నించగా, వేలిపై ఉన్న సిరా గుర్తులను బట్టి తాము ఎన్నికల్లో ఓటు వేసినట్లు వారు అంగీకరించారు. వెంటనే వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో, వేళచ్చేరి నియోజకవర్గంలో ఓటు వేసినట్లు అంగీకరించిన బ్రిటన్ పౌరుడిని చెన్నై విమానాశ్రయంలో అధికారులు నిర్బంధించి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.

విదేశీ ఓటర్ల కుటుంబాలపై విచారణ
ఓటరు నమోదు ఫారమ్‌లను నింపే సమయంలో కుటుంబ సభ్యులు బాధ్యులై ఉండవచ్చని, ఇది తప్పుడు ప్రకటన కిందకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. విదేశాలకు తిరిగి వెళ్లిన వారిపై తదుపరి చర్యలకు రంగం సిద్ధమవుతోంది. విదేశీయులు అక్రమంగా ఓటు వేయడం అంటే కేవలం చట్టపరమైన ఇబ్బందులే కాకుండా, వారి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, ఈ ఓట్ల చెల్లుబాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఎన్నికల కమిషన్ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications