బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టిను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్ సీఎంతో ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గానూ రూ. 2 కోట్లను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మంత్రులు మహమూద్ అలి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు నిఖత్ జరీన్‌ను మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు.
గురువారం నూతన సచివాలయంలోని మంత్రి మల్లా రెడ్డి ఛాంబర్‌లో తండ్రితో కలిసి నిఖత్ జరీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాక్సర్ నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలియజేసిన మంత్రి మల్లా రెడ్డి.. ఇలాంటి వరల్డ్ ఛాంపియన్ షిప్‌లు మరెన్నో గెలిచి ఇండియా, తెలంగాణ పేర్లను నిలబెట్టాలని ఆకాంక్షించారు. అంతే గాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బంగారు పథకాలు సాధించాలని కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఆకాక్షించారు.

కాగా, నిఖత్ జరీన్ 50 కేజీల బాక్సింగ్ విభాగం లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌గా రెండోసారి నిలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహం అందించారు. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం కేటాయించారు.












Click it and Unblock the Notifications