పంజాబ్ లో టెన్షన్ టెన్షన్-పోలీసుల అదుపులో ఖలిస్తాన్ నేత అమృత్ పాల్ సింగ్ ? ఇంటర్నెట్ నిలిపివేత
అమృత్ సర్ : వారిసే పంజాబ్ డే పేరుతో నటుడు దీప్ సిద్దూ ప్రారంభించిన ఉద్యమ సంస్ధను కైవసం చేసుకుని ఖలిస్తాన్ అనుకూల ఉద్యమానికి మద్దతుగా రెచ్చపోతున్న అమృత్ పాల్ సింగ్ (amritpal singh) ను బంధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా జలంధర్ లోని నకోదర్ ప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రభుత్వం ఇంకా నిర్దారించాల్సి ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతున్న అమృత్ పాల్ సింగ్ ను బంధించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముందుగా ఆయన అనుచరులు ఆరుగురిని అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 వాహనాల్లో సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరి నుంచి అందిన సమాచారం మేరకు అమృత్ పాల్ సింగ్ ను జలంధర్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్ లో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ నడుపుతున్న వారిసే పంజాబ్ డే సంస్ధ కార్యకలాపాలకు అక్కడి యూత్ ఆకర్షితులు అవుతున్నారు.

అమృత్ పాల్ సింగ్ ను బంధించేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా దాదాపు 7 జిల్లాల్లో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పంజాబ్ పోలీసులు నిరంతరం కేంద్రంతో టచ్ లో ఉంటూ ఆయన్ను బంధించినట్లు తెలుస్తోంది. ఆయన్ను ప్రాధమికంగా ప్రశ్నించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఈ తతంగం అంతా పూర్తయ్యే వరకూ పంజాబ్ లో ఇంటర్నెట్, ఎస్.ఎం.ఎస్ సేవల్ని నిలిపేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తకుండా పంజాబ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications