మళ్ళీ పెరుగుతున్న మరణాలతో భారత్ కు టెన్షన్ .. తాజాగా 42,766 కొత్త కేసులు, 1,206 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు, తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే నిన్నటి కంటే కొద్దిగా కరోనా కేసులు తగ్గడం కాస్త ఊరట ఇచ్చినా కరోనా మహమ్మారి ఇంకా శాంతించలేదని, కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని పదే పదే కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. భారతదేశంలో శనివారం 42,766 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,07,95,716 కు చేరుకుంది.
గత 24 గంటల్లో 1,206 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వెయ్యికి పైగా మరణాలు పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు మొత్తం మరణాల సంఖ్య ఇప్పుడు 4,07,145 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. దేశంలో శుక్రవారం నమోదైన 43,393, బుధవారం 45,892 కేసులతో పోలిస్తే శనివారం కాస్త లెక్క తగ్గింది. శనివారం నమోదైన మరణాల సంఖ్య బాగా పెరిగింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 45,254 మంది బయటపడ్డారు. దీంతో రికవరీలు మొత్తంగా 2.99 కోట్లకు చేరుకోగా రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం 4,55,033 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 1.48 శాతానికి తగ్గింది. భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 37 కోట్లను అధిగమించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 9 న తెలియజేసింది. అందులో 10,98,62,585 మోతాదులను 18-44 ఏళ్లలోపు వారికి మొదటిసారిగా ఇవ్వగా, 35,08,932 మందికి రెండవ మోతాదు లభించింది. గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది .
ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగం కోసం అధికారం పొందిన మూడు వ్యాక్సిన్లలో కోవిషీల్డ్, కోవాక్సిన్ మరియు స్పుత్నిక్ వి లలో దేనినైనా తల్లులు టీకాలు వేయించుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచానికి కరోనా డెల్టా వేరియంట్ లు మాత్రమే కాకుండా, లాంబ్డా వేరియంట్, కప్ప వేరియంట్ భయం పట్టుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు భారతదేశంలో లాంబ్డా వైరస్ కేసులు నమోదు కాలేదని, అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications