Tesla: టెస్లాకు భారత్ లో షాకులు ? అమ్మింది 600 కార్లే..!
అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజ సంస్థ టెస్లాకు భారత్ లో మాత్రం షాకులు తప్పడం లేదు. తొలుత భారత్ లో తమ ఈవీ కార్ల ఎంట్రీకి అపసోపాలు పడిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు తీరా ఎంట్రీ ఇచ్చాక అమ్మడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ ఏడాది జూలైలో భారత్ లో తొలి ఈవీ కార్ల షోరూమ్ ప్రారంభించిన టెస్లా ఈ రెండు నెలల్లో చేసిన అమ్మకాలు చూస్తే భారత్ కు ఎందుకొచ్చానా అని మస్క్ తలపట్టుకోవాల్సిన పరిస్ధితి.
భారీ అంచనాల మధ్య భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా కంపెనీ ... జూలై 15న ఈవీ కార్ల అమ్మకాలు ప్రారంభించింది. ఈ ఏడాది 2500 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెస్లా కార్ల అమ్మకాలు నిరాశాజనకంగా సాగుతున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. జూలై నుంచి దాదాపు 600 మోడల్ వై కార్ల ఆర్డర్లు మాత్రమే వచ్చాయని తెలిపింది.

టెస్లా ఈ ఏడాది చివరి నాటికి భారతదేశానికి 350నుండి 500 కార్లను రవాణా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో దాని షాంఘై ప్లాంట్ నుండి వస్తుంది. కస్టమర్ చెల్లింపులు , ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఈ నాలుగు నగరాల వెలుపల కంపెనీ డెలివరీ సామర్థ్యం ఆధారంగా డెలివరీలు ప్రారంభంలో ముంబై, ఢిల్లీ, పూణే , గురుగ్రామ్‌లకు పరిమితం చేయనున్నారు.

భారత్-అమెరికా సుంకాల వార్ నేపథ్యంలో అమెరికన్ కంపెనీ అయిన తమకు ఇబ్బందులు ఉండవని టెస్లా లెక్కలు వేసుకుంది. అయితే ఆ లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లకు వ్యతిరేకంగా అమెరికా భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇది ఇప్పటికే దిగుమతి చేసుకున్న వాహనాల విషయంలో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ధరలతో కార్లను కొనేందుకు వినియోగదారులు జంకుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications