భారత ముస్లింలను పాకిస్తానీలుగా చిత్రీకరిస్తారా..!!
ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు కేంద్ర, ప్రాంతీయ నేతలు ఈ బస్సులో ఒకేచోట కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు కీలక ప్రతిపక్ష నాయకులు ఒకే వేదికపై కొలువుదీరారు.
ఈ సభలో ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. దీన్ని ఈ దేశం నుంచి ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. కాశ్మీర్ గతంలో భారత్‌లోనే ఉందని, ఇప్పటికీ ఇక్కడే ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందనీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావే లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ నుంచి విడదీయడానికి ఎవ్వరు ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని పేర్కొన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను నిరంతరం విమర్శిస్తూ, వారిని పాకిస్తానీలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోన్నారని మండిపడ్డారు. ముస్లింలను పాకిస్తానీలుగా చిత్రీకరించితే గానీ వాళ్లకు రాజకీయంగా ఎలాంటి మనుగడ ఉండదని వ్యాఖ్యానించారు. తమ రాజకీయాల కోసం ఒక వర్గం ప్రజలను పాకిస్తానీయులుగా చిత్రకరించడం తగదని, అలాంటి ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు.
దేశ సార్వభౌమాధికారం కోసం ముస్లిం సమాజం రక్తాన్ని ధారబోసిందని ఫరూక్ అబ్దుల్లా గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరంతో పాటు అంతకుముందు, ఆ తర్వా కూడా దేశం కోసం ముస్లింలు ప్రాణాలను అర్పించామని పేర్కొన్నారు. నేటికీ దేశ రక్షణ కోసం పోరాడుతున్నామని, రేపటి కోసం త్యాగాలు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. దేశంలో సామాజిక సామరస్యం దెబ్బతినకుండా ఉండేందుకు పౌరులందరూ ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయ లాభాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం దేశ భద్రతకు శ్రేయస్కరం కాదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎప్పుడూ దేశ సంక్షేమాన్ని, సమగ్రతనే కోరుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. తర, తమ అనే భేదాలు లేకుండా భారతీయులందరికీ రక్షణ కల్పించే పవిత్రమైన రాజ్యాంగమని, దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications
