కూటమికి బీటలు: సావర్కర్ కాదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్!!
రాహుల్ గాంధీపై లోక్సభలో అనర్హత వేటు వేసిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీడీ సవర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరో కొత్త దుమారం రేగింది. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి తాను సావర్కర్ ని కాదని, గాంధీనని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో దేశ రాజకీయాలలో కొత్త దుమారం రేగింది.
ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే సావర్కర్ ను కించపరచడం, కాంగ్రెస్ కూటమికి బీటలు పడేలా చేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. వీడీ సావర్కర్ ను అవమానించవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హెచ్చరించారు. హిందూ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాము ఆరాధ్య దైవంగా భావిస్తున్నామని, అవమానించడం మానుకోవాలని ఉద్ధవ్ థాకరే రాహుల్ గాంధీని కోరారు. సావర్కర్ 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లో ఊహకందని చిత్రహింసలను అనుభవించాడని, అది త్యాగానికి ప్రతిరూపం అని, అటువంటి సావర్కర్ ను అవమానించడాన్ని తాము భరించమని తేల్చి చెప్పారు.

సావర్కర్ విషయంలో పోరాటం చేయడానికి అయినా తమ సిద్ధంగా ఉన్నామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో జత కట్టామని, ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. కావాలని కొందరు ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీని రెచ్చగొడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు ఎన్సీపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే రాహుల్ గాంధీని రెచ్చగొట్టవద్దని భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన నరేంద్ర మోడీ ఇంటి పేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో సూరత్ కోర్టు ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం, ఆపై లోక్సభలో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం వంటి సంఘటనలతో రాహుల్ గాంధీ సావర్కర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మరొక కొత్త వివాదానికి కారణంగా మారాయి.












Click it and Unblock the Notifications