అలిగిన భార్యను బుజ్జగించేందుకు సెలవు కావాలంటూ కానిస్టేబుల్: లీవ్ లెటర్ వైరల్
లక్నో: సాధారణంగా ఎవరైనా ఏదైనా అవసరం ఉంటేనో.. లేదంటే అనారోగ్య కారణాలతో తమ ఉద్యోగాలకు సెలవులు పెడతారు. కానీ, ఈ కానిస్టేబుల్ కొంత ఆశ్చర్యాన్ని కలిగించేలా తన ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ రాశాడు. అలిగిన భార్యను బుజ్జగించేందుకు లీవ్ కావాలని అందులో రాశాడు. దీంతో అతని లీవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అలిగిన భార్యను బజ్జగించేందుకు లీవ్ కావాలి!
ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌధరికి గతేడాది డిసెంబరులో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యను ఇంటి వద్ద వదిలి తిరిగి విధుల్లో చేరాడు. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో భర్తపై అలిగిన ఆమె.. ఎన్నిసార్లు ఇతడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేసినా ఆ ఫోన్ తీసుకెళ్లి వాళ్ల తల్లికి ఇచ్చేది. ఆమె మాత్రం మాట్లాడేది కాదు.

అందుకే తనపై భార్య కోపంతో ఉందన్న కానిస్టేబుల్
ఈ నేపథ్యంలో భార్య తనపై అలిగిందని నిర్ధారణ కొచ్చిన కానిస్టేబుల్ గౌరవ్.. సెలవుపెట్టి ఇంటికెళ్లి ఆమెను బుజ్జగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన పై అధికారి అయిన ఏఎస్పీకి లీవ్ లెటర్ రాస్తూ.. పెళ్లయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోన్ కట్ చేస్తోందని, కొన్నిసార్లు ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోందని వాపోయాడు.

కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ
కాబట్టి అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు వారం రోజుల సెలవు కావాలని ఆ లీవ్ లెటర్‌లో విజ్ఞప్తి చేశాడు. ఆ లేఖ చూసి, గౌరవ్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజులపాటు సెలవు మంజూరు చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ హ్యాపీగా తన భార్య వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈ కానిస్టేబుల్ లీవ్ లెటర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications