రెండు సార్లు కరిస్తే వీధి కుక్కలకు జీవిత ఖైదు..! సర్కార్ షాకింగ్ ..!
దేశవ్యాప్తంగా వీధి కుక్క కాటు ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ మనుషుల్ని కరుస్తున్న వీధి కుక్కల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటే జంతు సంరక్షణ సంస్థలు, ఎన్జీవోలు మండిపడుతున్నారు. ఈ మధ్యే సుప్రీంకోర్టు కూడా రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం కావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాయి.
ఇదే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీధి కుక్క కాటు ఘటనలపై తీవ్రంగా స్పందిస్తోంది. వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో యూపీ సర్కార్ తాజాగా ఓ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వీధి కుక్కలు రెండుసార్లు మనుషుల్ని కరిచాయని నిర్ధారణ అయితే వాటికి జీవిత ఖైదు విధించాలని నిర్ణయించారు.

యూపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వు మేరకు వీధి కుక్కలు మనుషులు రెచ్చగొట్టకుండానే కరిచినట్లు గుర్తిస్తే వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించి 10 రోజులు అక్కడే పర్యవేక్షణలో ఉంచుతారు. అనంతరం స్టెరిలైజేషన్ చేసి వాటి శరీరాల్లో మైక్రో చిప్ ను అమర్చుతారు. తిరిగి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేస్తారు. ఈ కుక్కలు మళ్లీ ఎవరినైనా కరిస్తే వాటిని తిరిగి సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి జీవిత కాలం అక్కడే ఉంచేస్తారు. అక్కడి నుంచి ఎవరైనా వాటిని దత్త తీసుకునేందుకు అనుమతిస్తారు. ఇలా దత్తత తీసుకున్న వారు వాటి విషయంలో జీవితకాలం బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అయితే ఇలా కుక్కలు మనుషులు రెచ్చగొట్టకుండానే కరిచినట్లు నిర్దారించేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసారు. ఈ కమిటీ ప్రతీ కుక్క కాటు ఘటనను అందుబాటులో ఉన్న ఆధారాలతో పరిశీలిస్తుంది. కుక్కలు సహజంగానే రెచ్చిపోయి మనిషిని కరిచాయా లేక మనుషులు రెచ్చగొడితే కరిచాయా అన్నది నిర్ధారిస్తుంది. ఇందులో ఓ వెటర్నరీ డాక్టర్, జంతు వైఖరుల గురించి తెలిసిన నిపుణుడు, మున్సిపల్ శాఖ ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ కుక్కల్ని పదే పదే రెచ్చగొట్టే వారిపైనా తగు చర్యలకు సిఫార్సు చేస్తుంది.












Click it and Unblock the Notifications