వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UPSC: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గామినీ సింఘ్లా

మూడేళ్లకుపైనే గామినీ సింఘ్లా స్నేహితులను కలవలేదు. శుభకార్యాలు, వేడుకలకు హాజరుకాలేదు.

టీవీ సిరీస్‌లు చూడటం ఆపేశారు.. సినిమాలకు కూడా వెళ్లలేదు.. సోషల్ మీడియాకు కూడా దూరం జరిగారు. చండీగఢ్‌లోని తమ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవించే ఆమె తెల్లవారుజామునే నిద్రలేచేవారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ రోజుకు పది గంటల వరకు ఆమె చదివేవారు.

ప్రతికలు, పుస్తకాలు చదవడం, మాక్ టెస్టులు చేయడం, టాపర్ల యూట్యూబ్ వీడియోలు చూడటం ఇవే ఆమె దినచర్యలో భాగమయ్యాయి. తల్లిదండ్రులు, తమ్ముడితో మాత్రమే ఆమె మాట్లాడేవారు. ''ఒంటరితనం కచ్చితంగా ఉంటుంది. అయితే, ఆ ఒంటరితనమే మనల్ని లక్ష్యానికి చేరుస్తుంది’’అని గామినీ చెప్పారు.

ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన ''సివిల్ సర్వీస్ ఎగ్జామ్’’ కోసం ఆమె సన్నద్ధం అయ్యేవారు. దీన్ని చైనా నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ''గావోకావో’’తో పోలుస్తుంటారు. భారత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షకు లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు.

గామినీ సింఘ్లా

మూడు దశల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, రెండో దశలో భాగంగా నిర్వహించే రాత పరీక్షకు 1 శాతం కంటే తక్కువ మందినే ఎంపిక చేస్తారు.

2021లో గామినీ పరీక్ష రాసినప్పుడు, సక్సెస్ రేటు గత ఎనిమిదేళ్లలో అత్యంత తక్కువగా ఉంది. కేవలం 1800 మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరగా 685 మందిని ఎంపికచేశారు.

ఈ పరీక్షలో గామినీకి మూడో ర్యాంకు వచ్చింది. అంతేకాదు ఈ సారి మొదటి ముగ్గురూ మహిళలే. యూపీఎస్సీ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)ను గామినీ ఎంచుకున్నారు. దేశంలోని 766 జిల్లాలో కలెక్టర్లు ఈ విభాగం నుంచి పనిచేస్తుంటారు. ప్రభుత్వ విభాగాలతోపాటు ప్రభుత్వ కంపెనీలను సీనియర్ ఐఏఎస్ అధికారులు నడిపిస్తుంటారు. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు తాము పనిచేయాలని భావించే రాష్ట్రాల జాబితాను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి అనుగుణంగా అభ్యర్థులను రాష్ట్రాలకు కేటాయిస్తుంటారు.

''ఫలితాలను చూసిన రోజు, ఒక పెద్ద బరువును ఎత్తినట్లు అనిపించింది. ఆ రోజు గుడికి వెళ్లాను, డ్యాన్స్ కూడా చేశాను’’అని 24 ఏళ్ల గామినీ చెప్పారు.

''మన దేశంలో మంచి ప్రైవేటు ఉద్యోగాలు చాలా తక్కువ. మరోవైపు మన జీవితంలో ప్రతి అంశంలోనూ ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్ అనేది చాలా శక్తిమంతమైన, అత్యున్నత ఉద్యోగంగా చెప్పుకోవచ్చు’’అని లండన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్) సోషియాలజిస్టు సంజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

గామినీ సింఘ్లా

''ముఖ్యంగా చిన్న పట్టణాల నుంచి వచ్చే వారిని సివిల్ సర్వీస్ ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది. ప్రైవేటు రంగంలో తేలిగ్గానే చేరొచ్చు. అదే పైపైకి వెళ్లాలంటే కల్చరల్ క్యాపిటల్ కావాలి. ఇక్కడ సివిల్ సర్వీసే ఒక కల్చరల్ క్యాపిటల్’’అని శ్రీవాస్తవ వివరించారు.

చాలా మంది సివిల్ సర్వీస్ అభ్యర్థుల్లానే గామినీ కూడా ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టా తీసుకున్న తర్వాత జేపీ మోర్గాన్ చేస్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశారు. అయితే, అది పూర్తయిన వెంటనే సివిల్ సర్వీస్ కోసం సన్నద్ధం కావడం మొదలుపెట్టారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆమె ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని కలిశారు. అప్పుడే తను కూడా ప్రభుత్వ అధికారిని కావాలని, మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

''ఇది కాస్త కష్టమైన ప్రయాణమే. చాలా సమయం పడుతుంది. అయితే, మంచి ఫలితం వస్తుంది’’అని ఆమె చెప్పారు.

చాలా మందికి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని ఆ వయసులో గామినీ పుస్తకాలతో సాధన చేశారు. సవాళ్లను అధిగమిస్తూ తన సమయాన్ని కూడా తెలివిగా ఆమె ఉపయోగించుకున్నారు.

''కొన్నిసార్లు విసుగు వస్తుంది, అలసిపోతాం’’అని ఆమె చెప్పారు.

గామినీ సింఘ్లా

మారథాన్ లాంటి ప్లాన్

గామినీ మారథాన్ లాంటి ప్లాన్‌ను అనుసరించేవారు. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. పళ్లు, సాలడ్స్, డ్రై ఫ్ర్యూట్స్ లాంటి ఆహారాన్ని ఆమె తీసుకునేవారు.

బయట వ్యాయామానికి వెళ్లే బదులు, తన గదిలో ప్రతి మూడు గంటలకు ఒకసారి 200 నుంచి 300 సార్లు జంప్‌లుచేసేవారు. సమయం వృథా కాకుండా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు.

ఖాళీ సమయాల్లో ఆమె సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు చదివేవారు. ఈ మార్గంలో ఎంతవరకు వచ్చారో తెలుసుకునేందుకు ఆమె ఆన్‌లైన్ మాక్ టెస్టులకు హాజరయ్యేవారు.

''ఉదాహరణకు రెండు గంటల్లో వంద జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు ఎలా సమాధానం రాయగలనా? అని చూసుకునేదాన్ని. నేను చాలా మంది టాపర్ల ఇంటర్వ్యూలు చూశాను. ఇక్కడ అందరికీ 35-40 ప్రశ్నలు మాత్రమే తెలుస్తున్నాయి. మిగతావి మనం జాగ్రత్తగా ఊహించి పెట్టాల్సి ఉంటుంది’’అని గామినీ చెప్పారు.

కొన్ని పరీక్షలు శీతాకాలంలో జరుగుతాయి. దీనికి కూడా ఆమె ప్రత్యేకంగా సిద్ధమయ్యేవారు. ''మా ఇంట్లోని చల్లగా, వెలుతురు తక్కువగా ఉండే గదిలోకి వెళ్లి పరీక్షలు రాసేదాన్ని’’అని ఆమె చెప్పారు. మూడు రకాల జాకెట్లు వేసుకొని ఆమె పరీక్షలు రాసేవారు. వీటిలో తనకు సౌకర్యాంగా ఉండేదాన్ని ఆమె చివరగా ఎంపిక చేసుకునేవారు.

''పరీక్షల్లో కొందరు సౌకర్యవంతంగాలేని జాకెట్లు వేసుకోవడంతో సరిగా రాయలేకపోయినట్లు విన్నాను. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాను. మనం అన్ని విధానాలా అత్యుత్తమంగా సన్నద్ధం కావాలి’’అని ఆమె చెప్పారు.

తల్లిదండ్రుల సాయం

ఈ మారథాన్‌లో గామినీ తల్లిదండ్రులకూ పాత్ర ఉంది. వృత్తిరీత్యా వైద్యులైన వారు కూడా ఉత్సాహంతో ఆమెకు సాయం చేసేవారు.

''మా నాన్న రోజుకు మూడు వార్తా పత్రికలు చదివేవారు. నిజానికి ఈ పరీక్షలో 80 శాతం వాటా వార్తా పత్రికలదే. నా కోసం ముఖ్యమైన వార్తలను ఆయన సేకరించి పెట్టేవారు’’అని ఆమె చెప్పారు.

మరోవైపు మాక్ టెస్టుల్లో తమ్ముడు ఆమెకు సాయం చేసేవారు. ఆమె విజయం సాధించాలని తాతయ్యా, నాన్నమ్మ దేవుడిని ప్రార్థించేవారు.

''అందరూ తమ వంతుగా తమ కృషి చేసేవారు. తమ ఇంటికి ఎదురుగా భవన నిర్మాణం జరగడంతో సూర్యరశ్మికి అడ్డుపడింది. దీంతో టెర్రస్‌పై ఉన్న గదిని తీసేసి ప్రశాంతంగా చదువుకునే ఏర్పాట్లను మా నాన్న చేశారు. మీ అమ్మాయి ఎందుకు వేడుకలకు రావడం లేదనే ప్రశ్నలకు దూరం జరగడంతోపాటు ఒంటరిగా ఉంటున్నాననే భావనన నాకు కలగడకుండా చూసేందుకు వారు నాతోనే ఉండేవారు’’అని గామినీ చెప్పారు.

''వారు నా ప్రయాణంలో భాగం. నాతోపాటు కలిసి నడిచారు. ఇది కుటుంబం మొత్తం సాధించిన విజయం’’అని గామినీ చెప్పారు.

''సివిల్ సర్వీస్‌లో కొన్ని మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను దిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాలకు పంపిస్తుంటాయి. కొందరైతే ఆస్తులు, ఆభరణాలను కూడా అమ్మి పంపిస్తారు’’అని ఫ్రాంక్ రాసన్ పెరీరా చెప్పారు. సివిల్ సర్వీస్ అభ్యర్థులుగా ఎక్కువగా చూసే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో కరెంట్ అఫైర్స్ షోను ఫ్రాంక్ నడిపిస్తారు.

''చాలా మంది చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వస్తుంటారు. అయితే, నేడు చాలా మంది ఇంట్లోనే చదువుకుని కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అలా విజయవంతమైన ఒక అబ్బాయిని ఇటీవల నేను కలిశాను. అ అబ్బాయి తండ్రి ఒక కూలీ’’అని ఆయన చెప్పారు.

''కొంతమంది 16 ఏళ్లు కష్టపడి కూడా విజయం సాధించలేకపోతుంటారు’’అని ఆయన వివరించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 ఏళ్ల వరకు (ఆరుసార్లు) ఈ పరీక్ష రాయొచ్చు. షెడ్యూల్ కులాలు, తెగల అభ్యర్థులు 37 ఏళ్ల వరకు (ప్రయత్నాలపై పరిమితి లేదు) ఈ పరీక్ష రాయొచ్చు.

సివిల్ సర్వీస్‌తో ప్రజల జీవితాలపై మనదైన ముద్రవేసే అవకాశం లభిస్తుందని గామినీ చెబుతున్నారు. ఈ పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి? అనే అంశంపై ఆమె ఒక పుస్తకం కూడా రాశారు. ఎలాంటి త్యాగాలు చేయాల్సి ఉంటుంది? ఒత్తిడి ఎలా తట్టుకోవాలి? లాంటి అంశాలపై దీనిలో చాప్టర్లు కూడా ఉన్నాయి.

ఒక్కోసారి అసలు నేను విశ్రాంతి తీసుకోవడం మరచిపోయాని అనిపిస్తుందని గామినీ చెప్పారు. ''జీవితం చాలా బిజీగా మారిపోతోంది. మళ్లీ విశ్రాంతి తీసుకోవడం కష్టమేమోనని అనిపిస్తోంది’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
UPSC: How To Succeed In Civil Services Exams?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X