మగ సింహానికి అక్బర్-ఆడ సింహానికి సీత పేర్లా ! హైకోర్టుకు వీహెచ్పీ...
దేశంలో ఎన్నికల వేళ రాజకీయాలకేదీ అనర్హం అనేలా పరిస్ధితి మారిపోతోంది. చివరికి జంతువులు కూడా రాజకీయాల్లో భాగంగా మారిపోతున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ లోని సిలిగురి జూలో అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం మతం రంగు పులుముకుంటోంది. జూ అధికారుల నిర్ణయంలో హేతు బద్దతను ప్రశ్నిస్తూ విశ్వ హిందూ పరిషత్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది.
సిలిగురి జూలో కొత్తగా రెండు సింహాలు తెచ్చారు. ఇందులో ఒకటి మగ సింహం కాగా.. మరొకటి ఆడ సింహం. జూ అధికారులు వీటిలో మహ సింహానికి అక్బర్ పేరు, ఆడ సింహానికి సీత పేరు పెట్టారు. దీంతో విశ్వహిందూ పరిషత్ భగ్గుమంది. జూ అధికారుల నిర్ణయంపై మండిపడింది. మగ సింహానికి అక్బర్ పేరు పెట్టి, ఆడ సింహానికి సీత పేరు పెట్టడం వెనుక హేతుబద్ధత ఎక్కడుందని ప్రశ్నిస్తూ, ఈ పేర్ల నిర్ణయాల్ని రద్దు చేయాలంటూ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సిలిగురిలోని ఉత్తర బెంగాల్ వైల్డ్ యానిమల్స్ పార్క్ అధికారుల నిర్ణయంపై ఇప్పుడు కలకత్తా హైకోర్టు విచారణకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12న జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా త్రిపురలోని సెపాహిజలా జూ నుండి మరో ఎనిమిది జంతువులతో పాటు రెండు సింహాలను సిలిగురి జంతుప్రదర్శనశాలకు తీసుకువచ్చారు. వీటికి అప్పుడే ఈ పేర్లు పెట్టారు.
దీనిపై వీహెచ్పీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు హైకోర్టులో జస్టిస్ సౌగత భట్టాచార్య విచారణ జరపనున్నారు.సఫారీ పార్క్ అధికారులు ఆడ సింహానికి 'సీత'ని పేరు పెట్టడం సింహరాశికి వ్యతిరేకమని, సనాతన ధర్మంలోని మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని వీహెచ్పీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications