Vijay: విజయ్ కొత్త పార్టీ..పవన్ కళ్యాణ్‌ను మరిపిస్తాడా..?
Vijay TVK Party:భారత దేశ రాజకీయాల్లో దక్షిణ భారత రాజకీయాలకు ప్రత్యేక స్థానం గుర్తింపు ఉంది. అందునా తమిళనాట రాజకీయాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏ పార్టీ అయినా సరే తమిళ సంస్కృతి ఉట్టిపడేలా, తమిళ వాసన చెరిగిపోకుండా సిద్ధాంతాలను రూపొందిస్తుంది. ఇక తమిళ రాజకీయాలంటే మొదటగా గుర్తొచ్చేది పెరియార్,ఎంజీఆర్, కరుణానిధి,జయలలిత.ప్రస్తుతం డీఎంకే అన్నాడీఎంకే పార్టీల హవానే తమిళనాడులో కొనసాగుతోంది.
కరుణానిధి, జయలలితల మరణాంతరం ఆ లోటును పూడ్చే నాయకుడు లేదా నాయకురాలు ఆ రాష్ట్రంలో ఉద్భవించలేదు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టాలని భావించినప్పటికీ కొన్ని కారణాల చేత ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇక యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ పార్టీని పెట్టినప్పటికీ పెద్దగా ఆదరణ లేదా ప్రజామద్దతు లభించలేదు. ఇక తాజాగా మరో సూపర్ స్టార్ విజయ్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. మరి విజయ్ ఆ గ్యాప్‌ను ఫిల్ చేయగలరా...?

తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటి వరకు చాలామందికి తెలిసింది అక్కడి రెండు పార్టీలు మాత్రమే. ఒకటి డీఎంకే మరొకటి అన్నా డీఎంకే. ఇక అప్పుడప్పుడు కొన్ని పార్టీలు వచ్చినప్పటికీ అవి ఎక్కువ కాలం ఈ రెండు పార్టీల బలం ముందర నిలబడలేకపోయాయి. కొన్ని పార్టీలు అయితే ఆదిలోనే మమ అనిపించేశాయి.
ఇక తమిళనాడులో మరో పార్టీ రాబోతోంది. సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ 27 అక్టోబర్ 2024 అధికారికంగా ప్రజల ముందుకు వస్తుంది. విల్లుపురం జిల్లా విక్రవండిలో విజయ్ తన పార్టీ అధికారిక జెండాను ఆవిష్కరిస్తారు. జయలలిత కరుణానిధి మరణంతో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను నింపేందుకు విజయ్ తన కొత్త పార్టీతో ప్రజాశీర్వాదం పొందేందుకు సిద్ధం అవుతున్నారు.

3 లక్షలకు పైగా హాజరు..
ఇక చాలా గ్రాండ్‌గా లాంఛ్ చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇటు విజయ్ అభిమానులు, అటు సామాన్య ప్రజలతో కలిపి దాదాపుగా 3 లక్షల మంది హాజరవుతారని సమాచారం. తమిళనాడు నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర, కర్నాటక నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రానున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కొత్తపార్టీ వార్తతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఎగిరి గంతేసిన అభిమానులు, పార్టీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకోవడంతో చాలా నిరుత్సాహపడ్డారు. కొత్త పార్టీతో తమిళనాడు రాజకీయాలు సరికొత్త రూపును సంతరించుకుంటాయని ఆశపడి భంగపడ్డారు. అయితే విజయ్ ప్రారంభించనున్న టీవీకే పార్టీతో తమిళ ప్రజలు మరోసారి రాజకీయాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
ఇక పార్టీని అధికారికంగా ప్రారంభించబోయే విక్రవండిలో ఎటు చూసినా విజయ్ బ్యానర్లే కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఆ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 60వేల కుర్చీలు, వాహనాల పార్కింగ్‌కు విశాలమైన స్థలంను ఏర్పాటు చేశారు. పార్టీలోని ముఖ్యులు విశ్రాంతి తీసుకునేందుకు కారావాన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే అనుకుంటున్న 3 లక్షల కంటే ఎక్కువ మందే ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇక పార్టీ ప్రారంభానికి ముందు విజయ్ తన అభిమానులకు, ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. జరగబోయే కార్యక్రమంను అత్యంత క్రమ శిక్షణతో ఉండి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. 2026 ఎన్నికల నాటికి తొలి అడుగు పడాలని పిలుపునిచ్చారు.

ఎన్నో లెక్కలు..అంచనాలతో..
రాజకీయాల్లోకి రావాలన్న విజయ్ ఆలోచన ఒక్క రాత్రిలో చేసింది. తాను ఎన్నో లెక్కలు అంచనాలు, ఆలోచనలు చేసి కొత్త పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో డీఎంకే ఏఐడీఎంకేల పాలనే సాగింది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా టీవీకే ఎదగాలన్నది విజయ్ ఆకాంక్ష.అయితే విజయ్ అభిమానులు తప్పితే ఆ పార్టీలో ఇప్పటివరకైతే పేరుగాంచిన నాయకులు ఎవరూ కనిపించడం లేదు, చేరలేదు కూడా.ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ అరంగేట్రం పెరియార్ భావాల కొనసాగింపుగానే డీఎంకే చూస్తోంది.రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని దెబ్బతీసేందుకు టీవీకే పార్టీ వస్తుందనే అభిప్రాయంతో ఉంది.
ఇక ఈ ప్రారంభ సభను సక్సెస్ చేసేందుకు ఇటు గ్రామీణ ప్రాంతాలు అటు పట్టణ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అంతేకాదు సామాన్య ప్రజలను కూడా వారితో తీసుకొస్తున్నారు. ఒక్క ఈ కార్యక్రమానికే రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలు మాత్రం తమ సొంత ఖర్చులతో విజయ్ సభకు హాజరవుతున్నారని టీవీకే సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో హైలైట్స్ గురించి చెప్పాలంటే పార్టీ జెండా ఆవిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ జెండాలో పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులున్నాయి. సామాజిక న్యాయం,ఏకత్వం,అభివృద్ధిలకు సూచనగా ఈ రంగులు నిలుస్తున్నాయి.ఇక విజయ్ ఒక గంటపాటు ప్రసంగించనున్నారు. ఇందులో తమిళ ప్రాబల్యం, దేశభక్తి,సుస్థిరత అంశాలపై ఫోకస్ చేస్తారు.ద్రవిడ విలువలు, సమకాలీన సమస్యలు అంటే వాతావరణ అంశాల, విద్యా సంస్కరణలకు మధ్య టీవీకే పార్టీ ఒక వారధిలా నిలుస్తుందనే సంకేతాలు పంపనున్నారు.

ద్రవిడ సిద్ధాంతాలు..
ఇక కామన్ సింబల్ కోసం టీవీకే పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకుంది. కామన్ సింబల్ దక్కాలంటే ఒక రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో కనీసం 5శాతం నియోజకవర్గాల్లో పార్టీ తమ అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. టీవీకే పొలిటికల్ విజన్‌కు అనుగుణంగా, పార్టీ గుర్తును ఎంపిక చేసేందుకు విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక విజయ్ ప్రసంగించనున్న వేదికను పెరియార్, కె కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కటౌట్లను ఉంచుతూ ద్రవిడ సిద్ధాంతాలను పాటిస్తూనే రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు బాటలు వేస్తోందనే సంకేతాలు పంపుతున్నారు. 1950లో ఎంజీ రామచంద్రన్ ఆలపించిన పాట నుంచి తీసుకున్న పదాలతో టీవీకే పార్టీ గీతంను రాశారు.తమిళ జెండా సగర్వంగా ఎగురుతోంది,ఒక నాయకుడు ఉద్ధవించారు అనే అర్థంతో ఈ గీతం సాగుతుంది.
విజయ్ కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడులో ఇప్పటికే పాతుకపోయిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు పెనుసవాలుగా మారనుంది. విజయ్‌కు ఉన్న అతిపెద్ద అభిమానుల సంఖ్య రాజకీయంగాను అండగా నిలిస్తే ఈ మూడు పార్టీలకు చెమటలు పడతాయనే రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఆంధ్రరాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారనే విషయాన్ని సైతం పలువురు గుర్తు చేస్తున్నారు. మరి చూడాలి.. విజయ్ తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తారా లేక రజినీకాంత్‌లా మూన్నాళ్ల ముచ్చటే అనిపిస్తారా అని.












Click it and Unblock the Notifications