సిద్దరామయ్య క్యాబినెట్ లో బెంగళూరు కింగ్ ఎవరు ?, రెడ్డికి మరో చాన్స్ వస్తుందా ?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివారం మద్యాహ్నం సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా అదే రోజు ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సిద్దరామయ్య వర్గంలో, డీకే శివకుమార్ వర్గంలో మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులు చాల మంది ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలకు మొదటి విడతలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.

అయితే బెంగళూరు నగరానికి చెందిన ఎంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయి ?, బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి ఎవరు ? అని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోక వర్గాలు ఉన్నాయి. బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు తక్కువే అయినా గెలిసిన ఎమ్మెల్యేల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు.
బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. బ్యాటరాయణపుర నుంచి కృఫ్ణ భైరేగౌడ, గాంధీనగర్ నుంచి దినేష్ గుండూరావ్, చామరాజ్ పేట్ నుంచి జమీర్ అహమ్మద్ ఖాన్, శాంతి నగర నుంచి ఎన్ఏ హ్యారిస్, విజయనగర నుంచి ఎం, కృఫ్ణప్ప, హెబ్బాళ నుంచి భైరతి సురేష్, సర్వజ్ఞనగర్ నుంచి కేజే. జార్జ్, ఆనేకల్ నుంచి శివన్న తదితరులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

రామలింగా రెడ్డి, జమీర్ అహమ్మద్, దినేష్ గుండురావ్, కృఫ్ణ భైరేగౌడ, జార్జ్ కు మంత్రి పదవులు గ్యారెంటీగా వస్తాయి, అయితే వీరిలో ఎవరికి బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2013లో సిద్దరామయ్య సీఎం అయిన తరువాత రామలింగా రెడ్డి మంత్రి అయ్యారు.
రామలింగా రెడ్డికి బెంగళూరులో ప్రతిమూల తెలుసు, అందుకే సిద్దరామయ్య క్యాబినెట్ లో మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డికి అప్పట్లో బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కూడా రామలింగా రెడ్డిని బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రిగా నియమించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి ఎవరు అయినా వారికి చేతినిండా పని ఉంటుంది.












Click it and Unblock the Notifications