మహిళా బిల్లుకు షాక్-ఎన్డీయే నిరసనలు.! మద్దతుకు రాహుల్ షరతు..!
మహిళా రిజర్వేషన్ల (women reservations) అమలును వేగవంతం చేసేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును (131st amendment bill) లోక్ సభ 298-230 ఓట్ల తేడాతో తిరస్కరించడంతో ఎన్డీయే సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2014లో మోడీ సర్కార్ తొలిసారి ఏర్పాటైన తర్వాత లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఓ బిల్లు ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో కేంద్రాన్ని నడుపుతున్న బీజేపీ కూడా అవాక్కైంది. లోక్ సభలో (Lok Sabha) బిల్లు ఓడిపోయాక దాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం.. దీన్ని మళ్లీ పెడతామని స్పష్టం చేసింది.
మరోవైపు లోక్ సభలో ఇవాళ మహిళా బిల్లు మెజార్టీ సాధించలేక ఓడిపోవడంతో ఎన్డీయే (NDA) ఎంపీలు పార్లమెంట్ బయట నిరసనలకు దిగారు. లోక్ సభ బయటికి రావడంతోనే నినాదాలు చేస్తూ బీజేపీ, ఎన్టీయే మిత్రపక్షాల ఎంపీలు రాహుల్ గాంధీకి, విపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా బిల్లు వీగిపోవడానికి విపక్షమే కారణమంటూ విమర్శలు చేశారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు మోడీ (pm modi) సర్కార్ లో ఓ బిల్లును లోక్ సభలో ఓడించడంలో తొలిసారి సక్సెస్ అయిన విపక్షాలు సంతోషంలో మునిగిపోయాయి. లోక్ సభలో బిల్లు ఓడిపోగానే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అటు విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పినట్లుగానే ఈ బిల్లును దగ్గరుండి ఓడించారు. అనంతరం మాట్లాడుతూ.. 2023లో తెచ్చిన మహిళా బిల్లును యథాతథంగా తెస్తే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదే విషయం ఆయన లోక్ సభలో చేసిన ప్రసంగంలోనూ తెలిపారు. అయితే కేంద్రం దానికి స్పందించలేదు. ఇప్పుడు లోక్ సభలో బిల్లు ఓటమి నేపథ్యంలో రాహుల్ షరతుకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications