జ్ఞానవాపి మసీదు వివాదంపై యోగీ సంచలన కామెంట్స్-తప్పు సరిచేయాలని ముస్లింలకు సూచన..
ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. వార్తా సంస్ధ ఏఎన్ఐతో మాట్లాడుతూ యోగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మసీదు వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు యోగీ వెల్లడించారు. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, వాటిని హిందువులు పెట్టలేదని యోగీ తెలిపారు.
మనం ఇప్పుడు దాన్ని (జ్ఢానవాపి మసీదు)మసీదుగా పిలిస్తే తప్పవుతుందని, కాబట్టి దీనికో పరిష్కారం లభించాలని ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ముస్లింలు ఈ మసీదు విషయంలో చారిత్రక తప్పిదం చేశారని, కాబట్టి దాన్ని సరిదిద్దడానికి ముందుకు రావాలని సూచించారు. జ్ఞానవాపి నిజంగానే మసీదు అయితే శివలింగం అక్కడ ఏం చేస్తుందని యోగీ ప్రశ్నించారు. దీంతో సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

జ్ఞానవాపి మసీదులో గతంలో కోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేస్తుండగా అక్కడ ఓ శివలింగం లాంటి ప్రతిమ దొరికింది. దీని ఆధారంగా అక్కడ సర్వే నిర్వహించాలని, పూజలకు అనుమతి ఇవ్వాలని పలు హిందూ సంస్ధలు స్ధానిక వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఏఎస్ఐతో సర్వే చేయించేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై మసీదు కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తిరిగి అలహాబాద్ హైకోర్టులోనే విషయం తేల్చుకోవాలని వారికి సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అలహాబాద్ హైకోర్టును మసీదు కమిటీ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మసీదుకు నష్టం కలగకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించింది. దీనిపై ఏఎస్ఐ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణ ముగించిన హైకోర్టు ఆగస్టు 3న తీర్పు ఇస్తామని ప్రకటించింది. మరో మూడు రోజుల్లో ఈ తీర్పు రానున్న నేపథ్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications