Yogi Adityanath : ట్విట్టర్ లో యోగీ సరికొత్త రికార్డు-25 మిలియన్ ఫాలోవర్లతో తొలి సీఎంగా..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. యూపీలో తన సంచలన నిర్ణయాలు, పాలనా పటిమతో యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు దేశంలోనే పాపులారిటీ సీఎం రికార్డులు కూడా బద్దలు కొడుతున్నారు. ప్రధాని మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా అయితే ప్రధాని అయ్యే క్రమంలో రికార్డులు బద్దలు కొట్టారో అదే తరహాలో ఇప్పుడు యోగీ కూడా పాపులర్ అవుతున్నారు.
సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో యోగీ ఆదిత్యనాథ్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనంత స్ధాయిలో యోగీ ఆదిత్యనాథ్ కు ట్విట్టర్ లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యోగీ సీఎం అయిన తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చిన ట్విట్టర్ పాపులారిటీ ఇప్పుడు ఏకంగా 25 మిలియన్లకు చేరుకుంది. దీంతో దేశంలో మరే ఇతర సీఎంకు లేని స్ధాయిలో యోగీ ట్విట్టర్ పాపులారిటీ రికార్డులు సృష్టిస్తోంది.

యోగీ ఆదిత్యనాథ్ ఈ 25 మిలియన్ ఫాలోవర్ల రికార్డును కేవలం 8 ఏళ్ల వ్యవధిలోనే అధిగమించడం విశేషం. 2015 సెప్టెంబర్లో ట్విట్టర్లోకి అడుగుపెట్టిన యోగీ.. ఈ 8 ఏళ్లలో ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ముఖ్యంగా 2017లో తొలిసారి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీకి సీఎం అయిన తర్వాత చేపట్టిన సంస్కరణలతో యోగీ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. శాంతిభద్రతలు, సుపరిపాలన, అభివృద్ధి వంటి అంశాలపై యోగీ తనదైన మార్కు వేయడంతో ఆయనకు ఫాలోవర్లు పెరుగుతూ వస్తున్నారు.
యోగీ ఆదిత్యనాథ్ తాజా రికార్డుతో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ట్విట్టర్లో 25 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో చేరిపోయారు. అంతే కాదు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సీఎంగానూ యోగీకి పేరుంది. ట్విట్టర్లో అత్యంత యాక్టివ్ గా ఉండే సీఎం, రాజకీయ నాయకుడిగా కూడా యోగీకి పేరుందని యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications