Yogi Adityanath: జమిలి ఎన్నికలకు యోగీ ఆదిత్యనాథ్ మద్దతు-తక్షణావసరమని వెల్లడి...
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. కేంద్రం ఈ నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో
దీనికి మద్దతుగా బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను స్వాగతిస్తూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేంద్రం ఏర్పాటు చేసిన జమిలి ఎన్నికల కమిటీని కూడా యోగీ స్వాగతించారు. జమిలి ఎన్నికల వల్ల జరిగే మేలును ఆయన వివరించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' ప్రతిపాదనపై మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధికి వేగవంతమైన పాలన అవసరమని, ఈ దృక్కోణంతో 'ఒక దేశం-ఒకటే ఎన్నికలు' అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం అన్నారు. సంపన్నమైన ప్రజాస్వామ్యానికి, రాజకీయ స్థిరత్వం నిజంగా ముఖ్యమైనదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధి కోసం వేగవంతమైన పాలన అవసరమని యోగీ తెలిపారు.

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇవాళ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీని కూడా యోగీ ఆదిత్యనాథ్ స్వాగతించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ పౌరుల తరపున తానుప్రధాని మోడీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్లు సిఎం యోగి తెలిపారు. జమిలి ఎన్నికల వల్ల సమయం ఆదా అవుతుందని యోగీ వెల్లడించారు. ఎన్నికలు పదేపదే జరుగుతుండటంతో అభివృద్ధి పథంలో అవరోధాలు ఏర్పడుతున్నట్లు యోగీ తెలిపారు.
తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రతిసారీ నెల, నెలన్నర సమయం వృథా అవుతోందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. దీన్ని నివారించడంతో పాటు వ్యయాన్ని ఆదా చేసేందుకు జమిలి ఎన్నికలు సరైన నిర్ణయం అవుతుందన్నారు. ఈ దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదిస్తే గతేడాది రెండోసారి ఎన్నికైన యోగీ సర్కార్ కూడా ముందుగానే రద్దవడం ఖాయం.












Click it and Unblock the Notifications